Begin typing your search above and press return to search.

బావను గెలిపించేందుకు రంగంలోకి హీరో!

By:  Tupaki Desk   |   28 Nov 2018 6:56 AM GMT
బావను గెలిపించేందుకు రంగంలోకి హీరో!
X
బావ కళ్లల్లో ఆనందం కోసం మర్డర్లు చేసిన బామ్మర్దులను చూశాం. కానీ ఇక్కడ బావ గెలుపు కోసం బామ్మర్ధి ప్రచార పర్వంలోకి దూకేశారు. ఆ బామ్మర్ధి ఏమీ సామాన్యుడు కాదు.. ఒకప్పుడు హీరోనే.. ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. అతడే హీరో వేణు. ఓ పదేళ్ల క్రితం హీరోగా తెలుగు నాట తళక్కున మెరిసిన హీరో ఇప్పుడు ప్రచార పర్వంలోకి దూకేశాడు. వేణు చివరగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’ సినిమాలో ఓ పాత్రను చేశారు. తాజాగా ఆయన బావ అయిన టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తరుఫున ఖమ్మం అసెంబ్లీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిపించేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నాడు.

నామా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచారు. అంతకుముందు ఖమ్మం పార్లమెంట్ నుంచి టీడీపీ తరుఫున బరిలోకి దిగి ఏకంగా బలమైన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరినే మట్టికరిపించిన చరిత్ర నామాకు ఉంది. కానీ ఈసారి చంద్రబాబు కోరిక మేరకు అసెంబ్లీకి పోటీపడుతున్నారు.

సొంత బావ అయిన నామ నాగేశ్వరరావు కోసం హీరో వేణు మూడు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. గల్లీగల్లీ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ నామాకు ఓటు వేయాలని కోరుతున్నారు. 2009లో కూడా వేణు నామా తరుఫున ప్రచారం చేశారు.

ప్రస్తుతం ఖమ్మంలో టీఆర్ ఎస్- మహాకూటమి మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. దీంతో నామా తాను గెలవడం కోసం ఉన్న అన్ని అవకాశాలను ప్రయోగిస్తున్నారు. సినీ గ్లామర్ కోసం తన బావమరిది హీరో వేణును కూడా రప్పించి ప్రచారం చేయిస్తున్నారు. బావ కళ్లల్లో ఆనందం కోసం బావమరిది హీరో వేణు ఇంటింటికి తిరుగుతూ చెమటోడుస్తున్నారు. మరి బలమైన టీఆర్ఎస్ ఊపు ను తట్టుకొని నామా నిలబడుతాడా లేదా అన్నది డిసెంబర్ 11న తేలబోతుంది.