Begin typing your search above and press return to search.

మందేసి బ్యాటింగుకు దిగితే రికార్డులే!

By:  Tupaki Desk   |   14 March 2017 12:31 PM GMT
మందేసి బ్యాటింగుకు దిగితే రికార్డులే!
X
పదకొండేళ్ల కిందట.. 2006లో ఇదే నెలలో ఏం జరిగిందో క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 434 పరుగుల టార్గెట్ ను వన్డే క్రికెట్ లో చేజ్ చేసి చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా జట్టు. ఆ మ్యాచ్ లో అప్పటి ఓపెనర్ హెర్షలే గిబ్స్ 175 పరుగులు చేసి గెలిపించాడు. జోహాన్నెస్‌ బర్గ్‌ లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్‌ చెలరేగిపోయాడు. ఆసిస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు. అయితే.. గిబ్బ్ అంతలా విరగబాదడానికి ముందు ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. మ్యాచ్ కు ముందు ఆయన ఫుల్లుగా మందేసి బ్యాటింగుకు దిగాడట.

అప్పటి అదరగొట్టే పెర్ఫార్మెన్సు వెనుక రహస్యాన్ని గిబ్స్ తాజాగా తన పుస్తకంలో వెల్లడించాడు. వన్డే మ్యాచ్‌ కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్‌ హ్యాంగోవర్‌ స్థితిలో గిబ్స్‌ బ్యాటింగ్‌ కు దిగాడట. ఆ హ్యాంగోవర్‌ తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడట. ఈ విషయమంతా ఆత్మకథలో గిబ్స్‌ వెల్లడించాడు. మ్యాచ్‌ కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌ గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌ తోనే బ్యాటింగ్‌ కు దిగానని గిబ్స్‌ వెల్లడించాడు.

సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్‌ కు ఆ హ్యాంగోవర్‌ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు - ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌ లో గిబ్స్‌ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది. మొత్తానికి మందేస్తే క్రికెటర్లు మరింత బాగా బ్యాటింగు చేసేలా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/