Begin typing your search above and press return to search.

ఫ్లైట్ మిస్సయ్యాడని జట్టునుంచి తీసేశారు

By:  Tupaki Desk   |   5 Oct 2022 12:30 AM GMT
ఫ్లైట్ మిస్సయ్యాడని జట్టునుంచి తీసేశారు
X
అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకునేందుకు అన్ని జట్లు పోటీ పడుతుంటాయి. ప్రపంచకప్ వస్తుందంటే చాలు ఏడాది ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టి ప్రణాళికలు రచిస్తుంటాయి. ఇక, ఎన్నో చర్చలు జరిపిన తర్వాతే ప్రపంచకప్ లో పాల్గొనే తుది జట్టును ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటిస్తుంటాయి. అయితే, జట్టు కూర్పుపై మల్లగుల్లాలుపడి ఒకసారి తుది జట్టును ప్రకటించిన తర్వాత దాదాపుగా మార్పులు చేసేందుకు ఏ జట్టు ఇష్టపడదు.

ఎవరైనా ఆటగాడు అనుకోకుండా గాయపడితేనో, తీవ్ర అనారోగ్యం పాలైతేనో తప్ప అతడిని జట్టు నుంచి తొలగించరు. ఇటువంటి నేపథ్యంలో కేవలం ఫ్లైట్ ఎక్కేందుకు సమయానికి రాలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఒక మేటి క్రికెటర్ ను జట్టు నుంచి తొలగించడం షాకింగ్ గా మారింది. ఎయిర్ పోర్టుకు సరైన సమయానికి రాలేదన్న కారణంతో విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హెట్ మెయిర్ ను వెస్టిండీస్ టీ20 జట్టు నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది.

అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ నకు ముందుగా ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు బయలుదేరింది. వాస్తవానికి అక్టోబర్ ఒకటో తేదీన విండీస్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అయితే, వ్యక్తిగత కారణాలవల్ల తాను జట్టుతో పాటు రాలేనని చెప్పడంతో అక్టోబర్ మూడో తేదీన హెట్ మెయిర్ కు బోర్డు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. అయితే, అక్టోబర్ మూడో తేదీన కూడా విమానం బయలుదేరే సమయానికి తాను రాలేనని బోర్డుకి ముందుగానే హెట్ మెయిర్ తెలియజేశాడు.

కానీ, ఆ కారణంతో అతడిని టీ20 ప్రపంచకప్ నకు ఎంపిక చేసిన జట్టు నుంచి తొలగిస్తున్నట్టు విండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ తెలిపారు. ఆ స్థానంలో షమారా బ్రూక్స్ ను ఎంపిక చేసినట్లు ఐసీసీకి కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సమాచారం ఇచ్చింది. హెట్ మెయిర్ విజ్ఞప్తి మేరకు ఒకసారి అతని ప్రయాణాన్ని వాయిదా వేసామని, ఈ సారి ఆలస్యంగా రావడమో, వేరే వ్యక్తిగత సమస్యలు వస్తేనో మరొకరితో ఆ స్థానం భర్తీ చేస్తామని ముందుగానే అతడికి సమాచారమిచ్చామని జిమ్మీ చెబుతున్నారు.

కీలకమైన ప్రపంచకప్ నకు ముందు జట్టు కూర్పుపై రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, కేవలం ఇంత చిన్న కారణంతో జట్టులో కీలక సభ్యుడిని తొలగించడం సరికాదని విండీస్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. హెట్ మెయిర్ లోటు జట్టు విజయాలపై ప్రభావం చూపితే అందుకు బోర్డు నిర్ణయమే కారణమవుతుందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.