Begin typing your search above and press return to search.

హైపవర్ కమిటీ రెండోసారి భేటీ..రెండు గంటల పాటు ప్రధాన అంశాలపై చర్చ!

By:  Tupaki Desk   |   10 Jan 2020 12:36 PM GMT
హైపవర్ కమిటీ రెండోసారి భేటీ..రెండు గంటల పాటు ప్రధాన అంశాలపై చర్చ!
X
మూడు రాజధానులకి వ్యతిరేకంగా అమరావతి రైతులు గత 24 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధానిని తరలించడం లేదు అని , అమరావతితో పాటుగా మరో రెండు నగరాలని అభివృద్ధి చేస్తామని చెప్తున్నా కూడా అమరావతి రైతులు మాత్రం కొంతమంది రాజకీయ నేతల మాటలు విని ఆందోళనలు చేస్తున్నారు. దీనితో రాజధాని సమస్య పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అమరావతి రైతుల సమస్య పై చర్చించడానికి విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో రెండోసారి సమావేశం అయ్యింది. ఈ భేటీలో కమిటీ పలు కీలక అంశాలపై చర్చించింది. అన్ని ప్రాంతాల అభివృద్దే ద్యేయంగా చర్చలు జరిగాయని తెలిపారు మంత్రులు. సమావేశంలో తమ దృష్టికి తెచ్చిన డిమాండ్లు, విజ్ఞప్తులపై పూర్తిస్థాయిలో చర్చించి అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించామని తెలిపారు మంత్రులు. అలాగే పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడాలన్న అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.

అలాగే, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఇటు రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారంటూ మండిపడ్డారు.రెండున్నర గంటలపాటు సాగిన హైపవర్ కమిటీ రెండో భేటీలో జిల్లాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, టైమ్ లైన్ ఫిక్స్ చేయాలని అభిప్రాయపడింది కమిటీ. ముఖ్యంగా రాజధాని పేరుతో కృష్ణా-గుంటూరు జిల్లాలు నిర్లక్ష్యం అయ్యాయని హైపవర్ కమిటీ భావనగా ఉంది. బందరు పోర్టు నిర్మాణం తేదీ.. పూర్తి చేసే తేదీలను ప్రకటించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

ఇక మరోవైపు గత ప్రభుత్వం గుడివాడను గ్రీన్ జోనుగా ప్రకటించడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొడాలి నాని, అమరావతిలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న హైపవర్ కమిటీ అసెంబ్లీతో సరిపెట్టేస్తే అమరావతి అభివృద్ధి సాధ్యం కాదనే భావనలో ఉంది. ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమల మినహా ఇతర పరిశ్రమలు పెద్దగా రాలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఉద్యోగుల తరలింపు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులపై హైపవర్ కమిటీలో చర్చ సాగింది. రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందన్న హైపవర్ కమిటీ. మూడు రాజధానుల విషయంలో మెజార్టీ అంశాలకు 13వ తేదీన మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.