Begin typing your search above and press return to search.

కృష్ణా జిల్లాలో కరోనా కల్లోలం.. పల్లెలు అప్రమత్తం

By:  Tupaki Desk   |   3 April 2020 12:30 PM GMT
కృష్ణా జిల్లాలో కరోనా కల్లోలం.. పల్లెలు అప్రమత్తం
X
నెమ్మదిగా వ్యాపించిన కరోనా వైరస్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కౌంట్ పెరిగిపోతోంది. గంట‌గంట‌కు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతం కరోనా కాటుకు ప్రతి జిల్లా ప్రభావితమవుతోంది. అయితే ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లా తీవ్రంగా సతమతమవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లోనే కృష్ణ జిల్లాలో అత్యధిక కేసులు న‌మోదు కాగా ఇప్పుడు నెల్లూరు జిల్లా పోటీ పడుతోంది. ఇలా కరోనా కేసుల్లో ఆ జిల్లాలతో పాటు క‌డ‌ప‌, తూర్పుగోదావ‌రి జిల్లాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడలో ఒకరు కరోనాతో మృత్యువాత పడడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ఒక్కసారిగా 23 కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో కృష్ణా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ జోన్‌గా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ప్రకటించారు. ఒక్క విజయవాడలోనే కరోనా పాజిటివ్ కేసులు 18కి చేరుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక వాటితో పాటు జగ్గయ్యపేటలో 2 - నూజివీడు 2 -నందిగామలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నింటిని ప్రభుత్వం రెడ్‌‌జోన్‌గా ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేశారు. పట్టణం, పల్లె అని కూడా కరోనా వైరస్‌ ప్రబలుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై కట్టడి చర్యల్లో వేగం పెంచింది. ఈ సందర్భంగా గ్రామాల్లోకి కొత్తగా ఎవరూ రాకుండా చర్యలు చేపడుతున్నారు. లాక్‌ డౌన్‌ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. లాక్‌ డౌన్ అమలుపై నిబంధనలు అతిక్రమించిన వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

కరోనా నివారణకు ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా మాత్రం గ్రామస్తులే పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రాకపోకలు నిషేధం విధించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటుచేసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ అమలు నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.