Begin typing your search above and press return to search.

అందరికి తోఫాలు ఇచ్చే కేసీఆర్.. దసరాకు ఈ బస్సు బాదుడేంది?

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:39 AM GMT
అందరికి తోఫాలు ఇచ్చే కేసీఆర్.. దసరాకు ఈ బస్సు బాదుడేంది?
X
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండుగల్లో ఒకటైన దసరాకు టైమైంది. ఈ నెల రెండో వారంలో రానున్న ఈ పెద్ద పండుగను ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున చేసుకుంటారు. మిగిలిన పండగల సంగతి ఎలా ఉన్నా.. దసరాకు మాత్రం భారీ ఎత్తున చేసుకునే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా తాము చేసిన ఏర్పాట్ల గురించి వెల్లడించారు.

దసరా నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు పెద్ద ఎత్తున సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ పండుగ స్పెషల్ బస్సులు ఈ నెల 8 నుంచి 14 వరకు నడుపుతారని చెప్పారు. కాకుంటే.. ఈ ప్రత్యేక బస్సులకు ప్రత్యేక బాదుడు కూడా ఉంటుందన్న చేదు విషయాన్ని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు.. ఏపీకి కూడా ఈ ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.

ఈసారి ఏపీతో పాటు మహారాష్ట్ర.. కర్ణాటకకు కూడా ప్రత్యేక బస్సుల్ని నడుపుతామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బస్సుల్ని సిద్ధం చేస్తున్నారు. పండుగకు మత్తం 4035 బస్సుల్ని అందుబాటులోకి తేనున్నారు. కాకుంటే.. రెగ్యులర్ గా వసూలు చేసే ఛార్జికి అదనంగా యాభై శాతాన్ని ఈ ప్రత్యేక బస్సు టికెట్లుగా వసూలు చేస్తారు.

ఎంజీబీఎస్ నుంచి 3200 బస్సులు.. జేబీఎస్ నుంచి 1200 బస్సుల్ని నడపున్నారు. ఇవి కాకుండా మరికొన్ని బస్సుల్ని కూడా అదనంగా అందుబాటులోకి తేనున్నారు. ఈ పండగతో దాదాపు రూ.3 నుంచి రూ.4 కోట్ల మేర ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్క వర్గానికి లోటు లేకుండా తోఫాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్.. దసరా పండక్కి ఊరికి వెళ్లే వారి మీద భారం మోపకుండా.. బస్సులుఛార్జీలుగా అదనపు బాదుడు లేకుండా చేస్తే బాగుండేది. అందరికి అన్ని ఇచ్చే కేసీఆర్.. దసరా పండక్కి ఈ ప్రత్యేక బాదుడ్ని రద్దు చేస్తే బాగుంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.