Begin typing your search above and press return to search.

టీపీసీసీ: కొండా సురేఖకు కీలక పదవి?

By:  Tupaki Desk   |   27 Dec 2020 11:00 AM IST
టీపీసీసీ: కొండా సురేఖకు కీలక పదవి?
X
తెలంగాణ కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మునుపటిలాగా బలమైన నాయకులను తయారు చేయాలని యోచిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లోని ధీటైన నేతలను వెతికి వారికి పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికోసం బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి కావడం.. మంచి వాక్చాతుర్యం, ప్రధాని బీసీ సామాజికవర్గం కావడంతో సురేఖకు కలిసి వస్తోందని అంటున్నారు.

ఇప్పటికే పార్టీలో కీలక పదవులు చేపట్టి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు ధీటుగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నట్టు తెలిసింది. మహిళా అధ్యక్ష పదవి కోసం సునీతారావు, కాల్వ సుజాతల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.

టీపీసీసీ కార్యవర్గంలో ఈసారి మహిళలకు పెద్ద పీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్‌ ప్రస్తుత అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మరో నాయకురాలు ఇందిరా శోభన్‌లకు కమిటీల్లో సముచిత స్థానం లభిస్తుందని, మైనార్టీ వర్గానికి చెందిన నాయకురాలు ఉజ్మా షకీర్‌ మరికొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నేతలకు ఈసారి అవకాశం దక్కబోతోందని గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది.