Begin typing your search above and press return to search.

ఇప్పుడు కొత్త సచ్చివాలయం ఎందుకు ...ప్రభుత్వాని కి హైకోర్ట్ షాక్ !

By:  Tupaki Desk   |   3 Jan 2020 6:38 AM GMT
ఇప్పుడు కొత్త సచ్చివాలయం ఎందుకు ...ప్రభుత్వాని కి హైకోర్ట్ షాక్ !
X
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచ్చివాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సవాల్ చేస్తూ హై కోర్టులో పిల్ వేశారు. దీనిపై తాజాగా గురువారం విచారణ చేపట్టిన హైకోర్ట్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయ అంశంపై మంత్రివర్గం 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం చూస్తే చాలా గందరగోళంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావితరాలకు సరిపడేలా ఉన్నతస్థాయి నిర్మాణం చేయడమే కొత్త సచివాలయ ఉద్దేశం అని ఒక చోట ఉంటె , పాత సచివాలయానికే మార్పులు చేర్పులు చేసి ఆధునీకరించి వినియోగించుకోవాలని మరోచోట ఉంది. పరస్పర విరుద్ధంగా అంతా అయోమయంగా కేబినెట్‌ నిర్ణయం ఉంది. అసలు ప్రభుత్వం నిర్ణయం ఏమిటో స్పష్టంగా చెప్పాలి అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి క్లిష్టంగా ఉన్న ఈ నేపథ్యంలో కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించాలా? అని , అది ప్రజాహితం కోసమే అయినా కొత్తగా నిర్మాణం చేస్తే కనీసం అయిదారేళ్లు సమయం పడుతుంది. ఇందుకు వ్యయం చేశాక ఆదాయం ఏమీ రాదు. ఇలాంటప్పుడు కొత్తగా నిర్మాణం చేయాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలించేస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి? ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే? ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా? వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలకఫైళ్లకు కాళ్లు వస్తే పరిస్థితి ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. అసలు ఎంత కాలంలో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తర్వాత మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైందని, ఈ అంశంపై అధ్యయనానికి ఆ సంఘం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఏ నిర్ణయమూ తీసుకో లేదని చెప్పగానే ధర్మాసనం సచివాలయ భవనాల్ని కూల్చరాదని మాత్రమే తాము స్టే ఉత్తర్తులు జారీ చేశామని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశాలపై కాదని తేల్చి చెప్పింది. చివాలయాన్ని 70 శాతం వరకూ బూర్గుల భవనంలోకి, మిగిలిన 30 శాతాన్ని నగరంలోని వేరువేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించామని తెలిపారు. చాలా వరకూ మంత్రులు, ఆయా శాఖాధిపతులు ఒకేచోట ఉంటున్నారని చెప్పారు.

అలాగే , మంత్రివర్గ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదని చెప్పగానే, నిర్ణయం సహేతుకం కానప్పుడు న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ధర్మాసనం బదులిచ్చింది. అన్నీ ప్రభుత్వం చెబుతోంది గానీ, వాటిని కౌంటర్‌ పిటిషన్‌ ద్వారా హైకోర్టుకు తెలియజేయట్లేదని ధర్మాసనం తెలిపింది. ఆ తరువాత కొత్త సచివాలయ నిర్మాణానికి ఎన్ని రూ.కోట్లు అవసరం అవుతాయి, దానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి. ఎంత సమయం పడుతుంది. శాఖల వారీగా ఎంత స్థలం కావాలి...వంటి పూర్తి వివరాలతోపాటు సాంకేతిక కమిటీ నివేదిక ఇతర అంశాలపై రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ..విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.