Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వం దోబూచులాట‌.. అలా అదేశాలు ఇవ్వ‌లేమ‌న్న కోర్టు

By:  Tupaki Desk   |   29 Jan 2022 6:49 AM GMT
ప్ర‌భుత్వం దోబూచులాట‌.. అలా అదేశాలు ఇవ్వ‌లేమ‌న్న కోర్టు
X
మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకున్న‌ప్ప‌టికీ.. ఆ రాష్ట్ర హైకోర్టులో మాత్రం ఈ విష‌యంపై వాడివేడి వాద‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టం, పాల‌న వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన త‌ర్వాత దాఖ‌లైన పిటిష‌న్ల‌లో మిగిలిన అభ్య‌ర్థ‌న‌ల‌పై త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌నర్ల త‌ర‌పున న్యాయ‌వాదాలు హైకోర్టులో త‌మ వాద‌న‌లు బ‌లంగా వినిపించారు. కోర్టు విచార‌ణ త‌ప్పించుకునేందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని ర‌ద్దు చేసింద‌ని తెలిపారు. ఆ రాజ‌ధానుల చ‌ట్టాన్ని మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌భుత్వం చెబుతోంద‌న్నారు. ప‌ట్టుకోండి చూద్దాం అనే విధంగా కోర్టుతో ప్ర‌భుత్వం దోబూచులాడుతోంద‌ని ఆరోపించారు.

మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని ప్రభుత్వం ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాల‌ని ఆ పిటిష‌న‌ర్లు కోర్టును కోరారు. భూములిచ్చిన రైతుల‌కు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశించాల‌ని కోరారు. రాజ‌ధాని వ్యాజ్యాల‌పై విచార‌ణ‌ను ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డం ఇదే తొలిసారి కాద‌ని న్యాయ‌వాది ఉన్నం ముర‌ళీధ‌ర‌రావు వాద‌న‌లు వినిపించారు. అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌లు రైతుల‌పై ప్ర‌భుత్వం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతోందని ఆయ‌న తెలిపారు. రాజ‌ధాని కోసం ఇప్ప‌టివ‌ర‌కూ రూ.16,500 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేశార‌ని జ‌రిగిన న‌ష్టానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. బోస్ట‌న్ క‌న్స‌ల్టెన్సీ నివేదిక పెయిడ్ రిపోర్ట‌ని దాని కోసం ప్ర‌భుత్వం రూ.6 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ఆయ‌న కోర్టుకు తెలిపారు.

మూడు రాజ‌ధానుల చ‌ట్టం, దాన్ని ర‌ద్దు చేస్తూ తీసుకొచ్చిన తాజా చ‌ట్టం చెల్లుబాటు కానివిగా ప్ర‌క‌టించాల‌ని మ‌రో న్యాయ‌వాది పీబీ సురేశ్ కోర్టును కోరారు. అధ్య‌య‌నం చేసి మ‌రోసారి మూడు రాజ‌ధానుల చ‌ట్టం తెస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని అలాంటి శాస‌నం చేయ‌కుండా నిలువ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కానీ దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్ర‌, జ‌స్టిస్ ఎం. స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, జ‌స్టిస్ డీవీఎస్ఎస్ సోమ‌యాజుల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం అభ్యంత‌రం వ్యక్తం చేసింది. ఈ వాద‌న వింటుంటే చ‌ట్టాలు చేయ‌కుండా ముందే ప్ర‌భుత్వాన్ని నిలువ‌రించాల‌ని కోరుతున్న‌ట్లు ఉంద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. అలా చ‌ట్టాలు చేయ‌కుండా నిలువ‌రించ‌లేమ‌ని అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. శుక్ర‌వారం విచార‌ణ‌లో పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాదుల వాద‌న‌లు ముగియ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఆర్‌డీఏ, శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి త‌ర‌పు వాద‌న‌ల కోసం విచార‌ణ‌ను కోర్టు ఫిబ్ర‌వ‌రి 2కు వాయిదా వేసింది. అమ‌రావ‌తి అభివృద్ధికి గ‌తంలో ఇచ్చిన య‌థాత‌థ స్థితి ఉత్త‌ర్వులు అడ్డంకి కాదంటూ ఇటీవ‌ల ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్తర్వుల‌ను న్యాయ‌స్థానం పొడిగించింది.