Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడే: కేంద్రం.. హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   16 Dec 2020 2:39 PM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడే: కేంద్రం.. హైకోర్టు ఆగ్రహం
X
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అసలు భారతీయుడా? లేక జర్మనీ వాసియా అన్నది తేలడానికి సంవత్సరాలు పడుతోంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉండడంతో ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఆయన ప్రత్యర్థి, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏళ్లుగా కోర్టులో కొట్లాడుతున్నాడు. కానీ కోర్టులకు వెళ్లి వేములవాడ ఎమ్మెల్యే స్టేలు తెచ్చుకుంటూనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేంద్ర హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసుకు సంబంధించిన అఫిడవిడ్ కాకుండా కేవలం మెమో దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చెన్నమనేని జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్లీ కేంద్ర హోంశాఖ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారం తీసుకొని అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖకు సూచించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రప్రభుత్వం హైకోర్టు కు తెలిపింది.జర్మనీ పౌరసత్వాన్ని రమేశ్ బాబు 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోంశాఖ మైకోర్టుకు తెలిపింది. అయితే దీన్ని అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.