Begin typing your search above and press return to search.

తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్టు అక్షింతలు!

By:  Tupaki Desk   |   27 July 2018 1:51 PM GMT
తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్టు అక్షింతలు!
X
కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్‌ లను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ వారిద్ద‌రూ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో, ఆ ఇద్ద‌రిని శాసనసభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్త‌ర్వులు చూపించినా త‌మ‌ను శాస‌న స‌భ‌లోకి అనుమ‌తించ‌డం లేదంటూ కోమటి రెడ్డి - సంపత్‌ కుమార్ లు మ‌రోసారి కోర్టులో పిటిష‌న్ వేశారు. తెలంగాణ స‌ర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. దీంతో, శుక్ర‌వారం నాడు ఆ పిటిషన్ ను విచార‌ణ జ‌రిపిన కోర్టు....తెలంగాణ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తామిచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని తెలంగాణ అడిషనల్‌ అడ్వకేట్ జనరల్ రామచందర్‌ రావును ప్ర‌శ్నించింది.

ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రామ చంద‌ర్ రావుపై కూడా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదా....లేక పార్టీ తరఫు న్యాయవాదా అని ప్ర‌శ్నించింది. వారం రోజుల్లోగా హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో అసెంబ్లీ కార్యదర్శి - సెక్రటరీలు కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చ‌రించింది. ఈ పిటిష‌న్ త‌దుప‌రి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో కోర్టు వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఏవిధంగా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తికరంగా మారింది.