Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం !

By:  Tupaki Desk   |   4 March 2021 1:30 PM GMT
జీహెచ్ఎంసి పరిధిలో  అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం  !
X
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేకమంది కోర్టులకు వస్తున్నారని , నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని.. సిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ ఎం సీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది.

2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో అందుకు గల కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నాళాలు, కాలువలపై అక్రమ నిర్మాణాల కారణంగా వర్షం నీరు వెళ్లే దారి లేక నగరం ముంపునకు గురైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కారణంగానే గత ఏడాదిలో భారీ వర్షం కారణంగా నగరంలో చాలా ప్రాంతాల్లో ముంపుతో ఇబ్బంది పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్‌ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.