Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ కు తెల్ల రేషన్ కార్డు?

By:  Tupaki Desk   |   22 Dec 2018 7:31 AM GMT
ప్రభాస్‌ కు తెల్ల రేషన్ కార్డు?
X
హీరో ప్రభాస్‌ కు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పేలా లేదు. తన గెస్ట్ హౌజ్‌ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ సందర్భంగా "ప్రభాస్ బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువున) వ్యక్తి కాదనీ - బాహుబలి" అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాయదుర్గం పాన్‌ మక్తాలోని సర్వేనెంబర్‌ 5/3లోని 2083 గజాల స్థలాన్ని 2005 - 2006లో బి.వైష్ణవి రెడ్డి - రవీందర్‌ రెడ్డిల నుంచి ప్రభాస్‌ కొనుగోలు చేశారని ప్రభాస్ తరఫు న్యాయవాది చెప్పారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. క్రమబద్ధీకరణ కోరుతూ ఫీజును కూడా చెల్లించారని గుర్తుచేశారు.

ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌ కుమార్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబర్‌ 5/3లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెప్పారు. క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది దారిద్య్ర రేఖకు (బీపీఎల్‌) దిగువన ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ బీపీఎల్‌ పరిధిలోకి వస్తారా అని ప్రశ్నించింది. అయితే ప్రభాస్‌ బీపీఎల్‌ పరిధిలోకి రారని - ఆయన బాహుబలి అని శరత్‌ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ ఇతను ఆ బాహుబలినా.. మరి పిటిషన్‌లో ఉన్న పేరు అతనిదేనా? అంటూ ఆరా తీసింది. పిటిషనర్‌ అతనేనని నిరంజన్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు. కాగా, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాసనానికి శరత్‌ చెప్పారు.

దీంతో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - శేరిలింగంపల్లి తహసీల్దార్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్ - జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.