Begin typing your search above and press return to search.

హైకోర్టు విభజన కేసుపై తీర్పు ఇవ్వని చీఫ్ జస్టిస్

By:  Tupaki Desk   |   28 July 2016 7:15 AM GMT
హైకోర్టు విభజన కేసుపై తీర్పు ఇవ్వని చీఫ్ జస్టిస్
X
ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పును వెల్లడించాల్సి ఉంది. దీనిపై తీర్పు వస్తుందని భావించిన వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజనకు సంబంధించి కేసు ఒకటి హైకోర్టులో నడుస్తోంది. హైకోర్టు ఏపీలోనే ఉండాలంటూ ఏపీ చెబుతున్న మాటను సమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈఅంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇవ్వాల్సి ఉంది.

అయితే.. ఈ అంశంపై తీర్పు ఇవ్వని చీఫ్ జస్టిస్.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయంతో హైకోర్టు విభజన కేసును నలుగురు లేదా ఐదుగురు న్యాయమూర్తులున్న విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ.. ఆంధ్రా రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. అనవసరమైన వివాదానికి తావివ్వకుండా ఉండేందుకు వీలుగానే సీజే ఈ తరహా నిర్ణయం తీసుకొని ఉంటారన్న మాట న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. హైకోర్టు విభజన కేసు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నుంచి విస్తృత ధర్మాసనానికి బదిలీ కావటం వల్ల.. తదుపరి తీర్పుపై విమర్శలకు వచ్చే అవకాశాలు తగ్గే వీలుందన్న భావన వ్యక్తమవుతోంది.