Begin typing your search above and press return to search.

గ్యాగ్ ఉత్తర్వులపై హైకోర్టు ఆవేధన!

By:  Tupaki Desk   |   17 Oct 2020 6:15 AM GMT
గ్యాగ్ ఉత్తర్వులపై హైకోర్టు ఆవేధన!
X
’రాజధాని భూముల విషయంలో ఏసీబీ నమోదుచేసిన కేసులోని వివరాలు మీడియాకు తెలియకుండా తాము ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వ సలహాదారులు నిర్వహించిన ప్రెస్ మీట్ వల్ల నిష్ఫలమయ్యాయి’ అంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి తన ఆవేధనను వ్యక్తం చేశారు. గ్యాగ్ ఆర్డర్ సవరణపై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా జేకే మహేశ్వరి పై విధంగా స్పందించారు. సలహాదారు ప్రెస్ మీట్ పెట్టి తాము వద్దన్న వివరాలను అన్నింటినీ చెప్పేసిన కారణంగా ఇక గ్యాగ్ ఆర్డర్ ను సవరించాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. తమ ఉత్తర్వులను ప్రభుత్వం ఉల్లంఘించి అందరికీ వివరాలను చెప్పేసిన తర్వాత ఇక గ్యాగ్ ఆర్డర్ పై విచారణ జరిపి ఏమిటి ఉపయోగం అంటూ మండిపడ్డారు.

అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగానే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ +12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ విచారించటానికి రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలోనే తనపై ఏసీబీ ఎటువంటి విచారణ జరపకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏసీబీని ఆదేశించాలంటూ దమ్మాలపాటి హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఏకంగా గ్యాగ్ ఆర్డర్ నే జారీ చేసింది.

ఎఫ్ఐఆర్ లోని విషయాలేవీ మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా చర్చలు జరపకుండా, కనబడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేసింది. హైకోర్టు ఆర్డర్ పై దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎప్పుడో ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం మీడియా సమావేశం పెట్టారు. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై చాలా ఆరోపణలు చేశారు. చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటమే లక్ష్యంగా హైకోర్టు వైఖరిపై లేఖలో అనేక ఉదాహరణలు ఇచ్చారు.

ఇదే విషయమై మహేశ్వరి మాట్లాడుతూ కల్లం మీడియా సమావేశంలో చెప్పిన వివరాల వల్ల తమ గ్యాగ్ ఆర్డర్ కు విలువలేకుండా పోయిందంటూ ఆవేధన వ్యక్తం చేశారు. అయితే గ్యాగ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా కేసు వేసిన లాయర్ మమత మాట్లాడుతూ గ్యాగ్ ఆర్డర్ కు ప్రెస్ మీట్ వివరాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గ్యాగ్ ఆర్డర్ కేవలం ఏసీబీ ఎఫ్ఐఆర్ వివరాలకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుచేశారు. కల్లం తన మీడియా సమావేశంలో అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్ గురించే మాట్లాడలేదని చెప్పారు. పైగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన సమయానికి ముఖ్యమంత్రి అసలు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ రాయనేలేదని వివరించారు. కాబట్టి గ్యాగ్ ఆర్డర్ కు ప్రెస్ మీట్ కు సంబంధమే లేదన్నారు. అయినా మహేశ్వరి అంగీకరించకుండా గ్యాగ్ ఆర్డర్ సవరణపై ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.