Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేపై కేసు ర‌ద్దైపోయింది!

By:  Tupaki Desk   |   8 Jan 2017 4:25 AM GMT
ఆ ఎమ్మెల్యేపై కేసు ర‌ద్దైపోయింది!
X
నిజ‌మే... అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు న‌మోదు చేసిన కేసు కోర్టులో ఇంకా విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గానే... దానిని కొట్టేస్తూ ప్ర‌భుత్వం ఏకంగా జీవోనే జారీ చేసేసింది. ఫ‌లితంగా కోర్టు త‌న‌ను దోషిగానే, లేదంటే నిర్దోషిగానో తేల్చేకంటే ముందుగానే ఆ ఎమ్మెల్యే కేసు నుంచి విముక్తి పొందాడు. అధికార వ‌ర్గాల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న ఈ వ్య‌వ‌హారం ఏపీలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే... కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు ఎమ్మెల్యేగా టీడీపీ నేత బోడె ప్ర‌సాద్ కొన‌సాగుతున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థిని చిత్తుగా ఓడించారు. ఆ త‌ర్వాత కాస్తంత మాస్ ఫాలోయింగే ఉన్న బోడె... కాల్ మ‌నీ వ్యాపారుల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అయితే జ‌నాన్ని జ‌ల‌గ‌ల్లా పీడించిన కాల్ మ‌నీ రాక్ష‌సుల అస‌లు రూపం త‌న‌కు తెలియ‌ద‌ని, ఎప్ప‌టి నుంచో ఉన్న స్నేహంతోనే వారితో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లాన‌ని, అస‌లు కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో త‌న ప్ర‌మేయం లేద‌ని స్వ‌యంగా బోడెనే మీడియా ముందు వెల్ల‌డించారు.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ బోడె ప్ర‌సాద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి పెన‌మ‌లూరు మండ‌లం కానూరులోని పాత చెక్ పోస్ట్ సెంట‌ర్‌లో ధ‌ర్నాకు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై ఆయ‌న‌తో పాటు ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని కూడా వ‌దిలిపెట్టారు. అయితే బోడె, ఆయ‌న 14 మంది అనుచ‌రుల‌పై న‌మోదు చేసిన కేసు మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉందట‌. ఈ ఘ‌ట‌న జ‌రిగిందెప్పుడో తెలుసా... 2004లో. నాడు వైఎస్ అధికారంలో ఉండ‌గా, బోడె ప్ర‌సాద్ ధ‌ర్నా చేశారు. దాంతో నాడు న‌మోదైన కేసును అటు బోడెతో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా ఎప్పుడో మ‌రిచిపోయారు.

సాధార‌ణంగా పోలీసులు న‌మోదు చేసిన కేసుల‌ను కొట్టివేసే అధికారం ఒక్క కోర్టుల‌కే ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇక ఎప్పుడో 2004లో న‌మోదైన కేసు విష‌యాన్ని, అందులోనూ కేవ‌లం ధ‌ర్నా చేసిన కార‌ణంగా న‌మోదు చేసిన కేసును పోలీసులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. కార‌ణ‌మేదైనా... బోడెపై న‌మోదైన కేసుపై కోర్టులో ఇంకా విచార‌ణ సాగుతూనే ఉంది. ఇంత కాలానికి గుర్తెందుకొచ్చిందో తెలియ‌దు కాని... త‌న‌పై న‌మోదైన కేసును కొట్టేయాల‌ని బోడె ప్ర‌భుత్వానికి ఓ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌భుత్వం కేసును కొట్టివేస్తూ నిన్న ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫ‌లితంగా ఓ వైపు కేసు కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గానే... దాని నుంచి బోడె బ‌య‌ట‌ప‌డిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/