Begin typing your search above and press return to search.

హైకోర్టు ట్విస్ట్.. వాట్ నెక్ట్స్.?

By:  Tupaki Desk   |   14 Nov 2018 5:36 AM GMT
హైకోర్టు ట్విస్ట్.. వాట్ నెక్ట్స్.?
X
సీన్ రివర్స్ అయ్యిందా.? జగన్ పై హత్యాయత్నం విషయంలో వేసిన అడుగులు తప్పటడుగులు అయ్యాయా.? మంత్రులతో చేసిన ముప్పేట దాడి బూమరాంగ్ అయ్యిందా.? జగనే కోడికత్తితో పొడిపించుకున్నాడని ప్రచారం చేసిన ఆ పార్టీకి వ్యతిరేక ఫలితం వచ్చిందా.? ప్రజల మెదళ్లలో బలంగా ఇదే విషయాన్ని తన అనుకూల పచ్చమీడియాతో నాటి సానుభూతి కొట్టాలన్న డ్రామా బెడిసికొట్టిందా.? ప్రస్తుతం ఆ పార్టీ మంత్రులు, సీనియర్లలో దీనికి ఔననే సమాధానం వస్తోందట.. జగన్ పై హత్యాయత్నం విషయంలో చేసిన రాద్ధాంతం.. అభూత కల్పనలు పూర్తిగా బెడిసికొట్టిందని..


విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో సీసీ కెమెరాలు పని చేయలేదని హైకోర్టుకు విన్నవించడం.. ఇంత నిర్లజ్జ నిర్లక్ష్య సమాధానం ఇచ్చినందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి తాఖీదులు పంపడం జరిగిపోయింది. ఇది ఆ పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. చిన్న గల్లీ దుకాణంలో సైతం సీసీ కెమెరాలు ఉండాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. అత్యంత సెక్యూరిటీ ఉండే విశాఖ ఎయిర్ పోర్టులో సీసీ పుటేజీ లేదని హైకోర్టులో బుకాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. హత్యాయత్నం జరిగిన వెంటనే విచారణ చేయకుండానే.. అభిమానే దాడి చేశాడని పోలీసులతో ప్రకటన చేయించడం ఏమిటన్నది న్యాయ కోవిదుల ప్రశ్న.

కుట్రల కత్తి భుజంలోకి లోతుగా దిగినా - రక్తపు బొట్లు నేల రాలినా సంయమనం పాటిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌన రుషిలా కదిలిపోయిన జగన్‌ ను చూసి.. ప్రజలు - రాజకీయ నేతలు - జగన్ అంటే పడని వారు కూడా ప్రశంసలు కురిపించారు. జగన్‌ ఒక్క మాట మాట్లాడితే రాష్ట్రం అల్లకల్లోలమై ఉండేదని - అంత దెబ్బతిన్నా కూడా హుందాగా వ్యవహరించాడని రాజకీయ పండితులు కొనియాడుతున్నారు.. అదే సమయంలో సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు నోటికొచ్చి మాట్లాడడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చిందని అభిప్రాయపడుతున్నారు.

* సీల్డ్ కవర్‌ నివేదిక.. అదో అపహాస్యమే..

జగన్ పై హత్యాయత్నం విషయంలో సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే.. కానీ ఇందులో ఏమీ ఉండదని ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హత్యాయత్నం జరిగిన గంట గడవక ముందే ఇది అభిమాని దాడి అంటూ పోలీసులతో ప్రభుత్వం చెప్పించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దీనిపై ఎన్ని రోజులు విచారణలు చేసినా - ఎన్ని రోజులు కూపీ లాగినా చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా నివేదికను ఇస్తారని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజాగా ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం విషయంలో హైకోర్టు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు - రాష్ట్ర డీజీపీకి - ఎయిర్‌ పోర్టు అధికారులను నోటీసులు ఇచ్చింది.. ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని బాధ్యులైన వారు తర్జనభర్జన పడుతున్నారట.. ఏది ఏమైనా హైకోర్టు స్పందించిన తీరు ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.