Begin typing your search above and press return to search.

ఫిరాయింపుపై తెలంగాణ ఏజీకి హైకోర్టు పంచ్

By:  Tupaki Desk   |   17 July 2015 4:16 AM GMT
ఫిరాయింపుపై తెలంగాణ ఏజీకి హైకోర్టు పంచ్
X
కొన్ని అంశాల విషయంలో చేసే వ్యాఖ్యల విషయంలో కాస్తంత నేర్పు అవసరం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. తాజాగా తెలంగాణ ఏజీకి ఎదురైన పరిస్థితే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణలోని వివిధ పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కొందరు తెలంగాణ అధికారపక్షంలో చేరటం.. వీరిలో ఒకరికి రాష్ట్ర మంత్రి పదవి లభించటం.. ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై వేటు వేయాలని స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి కదలిక లేని నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే.

దీనిపై విచారణ సందర్భంగా.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలపై ఫిర్యాదు చేసిన మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ విషయంపై కోర్టులు నిర్ణయం తీసుకోవాలంటూ పిటీషనర్ న్యాయవాది వాదించారు.

దీనికి ప్రతిగా ఏజీ తన వాదన వినిపిస్తూ.. ఎమ్మెల్యేలపై చర్యలకు సంబంధించిన అంశం స్పీకర్ వద్ద పెండింగ్ ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత దశలో కోర్టుల్లో న్యాయ సమీక్ష జరపటానికి వీల్లేదని పేర్కొన్నారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒకవైపు మీ వద్ద ఉన్న వాటిపై నిర్ణయం తీసుకోరు. మరోవైపు న్యాయ సమీక్ష చేయకూడదంటారు. వాటిని పరిష్కరించటానికి ఒక టర్మ్ (ఐదేళ్లు) సరిపోతుందా? ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారా? లేదా? ఎంతకాలంలో చర్యలు తీసుకుంటారో మీ అభిప్రాయం చెప్పండి. వీటిపై విచారించాలా? లేదా? అనే అంశాలపై ఆలోచన చేస్తాం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తమ్మీదా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తితో ఉందన్న అభిప్రాయం తాజా పరిణామంతో స్పష్టమవుతోందని న్యాయవాద వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.