Begin typing your search above and press return to search.
బాబు ఎంత చెప్పినా...ఈ తీర్పు దెబ్బే
By: Tupaki Desk | 2 Sep 2017 6:14 AM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారుకు కోర్టు నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఆయనకు అత్యంత ఇష్టమైన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో. అందులోనూ చంద్రబాబు పదే పదే ఒకింత వక్రీకరణతో కూడినట్లుగా చెప్పే రైతుల విషయంలో కావడం గమనార్హం. రైతుల ఆకాంక్షలను ప్రభుత్వం తనదైన శైలిలో పక్కనపెట్టేసినప్పటికీ.... కోర్టు మాత్రం వారి అభ్యంతరం లకు పెద్దపీట వేయడం విశేషం.
ఇంతకీ విషయం ఏమిటంటే...ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పది గ్రామాల్లో భూ సేకరణకు సంబంధించి సీఆర్ డిఏ జారీ చేసిన నోటిఫికేషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. వంద మంది రైతుల అభ్యంతరాలను తాజాగా స్వీకరించాలని హైకోర్టు సీఆర్ డిఏ అధికారులను ఆదేశించింది. జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అమరావతి నిర్మాణం కోసమంటూ రైతుల నుంచి సేకరిస్తున్న భూ సేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా పార్టీలపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. కొన్ని చోట్ల ప్రజాభిప్రాయసేకరణలో రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
దీంతో తమకు న్యాయం జరగాలని కోరుతూ... అమరావతి ప్రాంతంలోని పది గ్రామాల్లోని పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎదురవుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సైతం తెలుసుకుంది. అయితే అవేమీ సహేతుకంగా లేకపోవడంతో....సీఆర్ డీఏ తుది డిక్లరేషన్లు ప్రకటించే ముందు రైతుల అభ్యంతరాలను స్వీకరించలేదని కోర్టు పేర్కొంది. తాజాగా మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలని ఆర్డర్ వేసింది.