Begin typing your search above and press return to search.

మల్లన్న సాగర్ పై రైతుల కేసు కొట్టేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:37 AM GMT
మల్లన్న సాగర్ పై రైతుల కేసు కొట్టేసిన హైకోర్టు
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు నుంచి పలు అంశాల్లో ఉమ్మడి హైకోర్టును నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కీలకమైన మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో తెలంగాణ సర్కారుకు ఊరటనిచ్చేలా హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో భూసేకరణను అడ్డుకోవాలంటూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రైతులు కోరుకున్నట్లుగా భూసేకరణ జరుపుతామని.. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ జరిపే ఆలోచన లేదంటూ తెలంగాణ సర్కారు వాదనను ఏజీ బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలో 12 మంది రైతులు దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ విపక్షాలు తప్పు పట్టటం.. పరిహారం విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు కోరినట్లుగానే పరిహారం చెల్లిస్తామని పేర్కొంటూ వివాదానికి ముగింపు పలికేలా వ్యవహరించారు.

అయితే.. ఈ ప్రాజెక్టు భూసేకరణను అడ్డుకుంటూ 12 మంది రైతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కొట్టి వేసింది. నిబంధనల మేరకే భూసేకరణను జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు కొట్టేసింది. తాజా తీర్పు నేపథ్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పొచ్చు.