Begin typing your search above and press return to search.

హైకోర్టులో బొండా ఉమ‌కు ఎదురుదెబ్బ‌!

By:  Tupaki Desk   |   29 Jun 2019 8:30 AM GMT
హైకోర్టులో బొండా ఉమ‌కు ఎదురుదెబ్బ‌!
X
టీడీపీ నేత‌.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన బోండా ఉమకు హైకోర్టులో షాక్ త‌గిలింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో ఓడిన ఆయ‌న‌.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన ఫ‌లితం స‌రికాద‌ని.. ఆ ఫ‌లితాన్ని నిలిపివేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ బోండా దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ‌కు అర్హ‌త లేద‌ని కొట్టేసింది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బోండా ఉమ పోటీలోకి దిగారు. ఆయ‌న‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా మల్లాది విష్ణు బ‌రిలోకి దిగారు. హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల్లో పాతిక ఓట్ల వ్య‌త్యాసంతో మ‌ల్లాది విజ‌యం సాధించారు.

ఇదిలా ఉంటే.. ఈవీఎంల లెక్కింపులో తాను చాలా అంశాల్ని ప‌రిశీలించాల‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితం స‌రికాద‌ని.. దాన్ని నిలిపివేయాలంటూ బోండా ఉమ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ఎదుట ఎన్నిక‌ల సంఘం త‌న వాద‌న‌లు వినిపించింది. టీడీపీ అభ్య‌ర్థి బోండా ఉమ దాఖ‌లు చేసిన రిట్ పిటిష‌న్ కు విచార‌ణ అర్హ‌త అస్స‌లు లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈసీ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన హైకోర్టు తాజాగా పిటిష‌న్ ను డిస్మిస్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఇదిలా ఉంటే బోండా ఉమ వాద‌న మ‌రోలా ఉంది. తాను పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో 11 పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్ల‌ను లెక్కించిన త‌ర్వాతే ఫ‌లితాల్ని ప్ర‌క‌టించాల‌ని కోరినా రిట‌ర్నింగ్ అధికారి ప‌ట్టించుకోలేద‌న్నారు. ఈ కార‌ణంతోనే స్వ‌ల్ప తేడాతో మ‌ల్లాది విష్ణు విజ‌యం సాధించార‌ని ఆరోపించారు. అయితే.. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం మీద సందేహాలు ఉంటే.. ఆ సంస్థ‌కు ఫిర్యాదు చేయాల‌ని కోర్టు సూచించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలిన నేప‌థ్యంలో ఈ ఇష్యూపై బోండా ఉమ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.