Begin typing your search above and press return to search.

వైసీపీ స‌ర్కారులో జోష్ నింపిన హైకోర్టు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   27 Aug 2021 8:30 AM GMT
వైసీపీ స‌ర్కారులో జోష్ నింపిన హైకోర్టు వ్యాఖ్య‌లు
X
ఏపీ హైకోర్టు.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. ఏపీ అదికార పార్టీ వైసీపీలో జోష్ నింపాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక కేసుల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్టిన హైకోర్టు.. చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెబుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ ఏర్పాటు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కోర్టు స‌మ‌ర్ధించ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఏర్పాటు చేయాలంటూ.. కొన్నాళ్ల కింద‌ట‌.. హైకోర్టు ఆదేశించ‌డంతో.. దీనిని క‌ర్నూలులో ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ప్ర‌స్తుతం.. అక్క‌డ భ‌వ‌నాల‌ను వెతుకుతున్నామ‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది.

అయితే.. క‌ర్నూలులో మాన‌వ‌హ‌క్క‌లు క‌మిష‌న్ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ.. ఏపీ పౌర‌హ‌క్కుల సంఘం సంయుక్త కార్య‌ద‌ర్శి మ‌ల్లేశ్వ‌ర‌రావు హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్‌) దాఖ‌లు చేశారు. దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ అరూప్ కుమార్‌ గోస్వామి, జ‌స్టిస్ ఎన్‌.జ‌య‌సూర్య‌తో కూడిన ధ‌ర్మాస నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలులో హెచ్ఆర్‌సీ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఇది ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యంగా కూడా పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన ధ‌ర్మాస‌నం.. రాష్ట్ర ప‌రిధిలో ఏర్పాటు చేయాల‌ని తాము చెప్పామే త‌ప్ప‌.. ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నే విష‌యం.. ప్ర‌భుత్వ విచ‌క్ష‌ణాధికార‌మ‌ని స్ప‌ష్టం చేసింది. "తెలంగాణ‌లో కాకుండా రాష్ట్ర ప‌రిధిలో హెచ్చార్సీని ఏర్పాటు చేయాల‌ని గ‌తంలో స్ప‌ష్టం చేశాం. ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది రాష్ట్ర విశేషాధికారం. రాష్ట్రంలో ఫ‌లానా చోటే హెచ్ఆర్‌సీని ఏర్పాటు చేయాల‌ని చెప్ప‌లేం" అని తేల్చి చెప్పింది. ఈ సంద‌ర్భంగా అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ స్పందిస్తూ.. క‌ర్నూలులో హెచ్చార్సీని ఏర్పాటు చేసేందు కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. హెచ్చార్సీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఒక‌టి రెండు రోజుల్లోనే ఇస్తామ‌న్నారు.

ఈ ప‌రిణామం.. వైసీపీలో జోష్ నింపింది. ఎందుకంటే.. ``హెచ్చార్సీని ఎక్క‌డైనా ఏర్పాటు చేసుకునే విచ‌క్ష‌ణాధికారం.. ప్ర‌భుత్వానికి ఉంది!`` అని కోర్టు చెప్ప‌డ‌మే. దీనిని బ‌ట్టి.. రాజ‌ధానిని కూడా ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. ఇదే విష‌యాన్ని గ‌తంలో కేంద్ర హోం శాఖ కూడా స్ప‌ష్టం చేసింద‌ని.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. అంతేకాదు.. ఒక రాజ‌ధానా? మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసుకోవాలా? ఎక్క‌డ ఏర్పాటు చేసుకోవాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ విచ‌క్ష‌ణాధికార‌మ‌ని, తమ జోక్యం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.


ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అంశంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌టం, తాజాగా హెచ్ఆర్‌సీ కార్యాల‌యం క‌ర్నూలులో ఏర్పాటుపై కీల‌క వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌ధానిపై ప్ర‌భుత్వ వాద‌న‌ల‌కు కూడా ఇదే ర‌క‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వం, వైసీపీ భావిస్తోంది. ఏది ఏమైనా హెచ్ఆర్‌సీ కార్యాల‌యం ఏర్పాటు అనేది చిన్న విషయ‌మే అయినా, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ విశేషాధికార‌మ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం అనేక అంశాల‌కు ముడిప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని పై జ‌రిగిన వాద‌న‌లు గ‌మ‌నిస్తే.. మూడు రాజ‌ధానుల విషయంపై హైకోర్టు ఎక్క‌డా వ్యాఖ్యానించలేదు. కేవ‌లం రైతుల‌కు న్యాయం చేయాల‌నే విష‌యాన్ని మాత్రం గ‌ట్టిగా ప‌రిశీలిస్తోంది. మున్ముందు.. ఈ విష‌యంలో ఎలాంటి తీర్పు వ‌స్తుందో చూడాలి.