Begin typing your search above and press return to search.

సారు మొండితనం.. హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో లాయర్ల ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   29 Oct 2019 5:26 AM GMT
సారు మొండితనం.. హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో లాయర్ల ఉక్కిరిబిక్కిరి
X
ఆర్టీసీ సమ్మె వ్యవహారం హైకోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వేళ.. ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఏ తరహాలో వ్యాఖ్యలు చేశారో.. తానేం చేయాలనుకుంటున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేయటం తెలిసిందే.

తనకున్న అధికారాలతో తానేం చేయనున్నానన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిన కేసీఆర్ మాటలు ఆర్టీసీ ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచాయి. హైకోర్టు పేర్కొన్న విధంగా కార్మికులతో చర్చలు కూడా జరపని వైనంపై న్యాయస్థానం ఇప్పటికే గుర్రుగా ఉంది. తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు సంధించిన ప్రశ్నల పరంపరకు తెలంగాణ సర్కారు తరఫు న్యాయవాదుల నోట మాట రాని పరిస్థితి. ఇలాంటివేళ.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నది వాస్తవమేనా? ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తంలో తక్షణమే ఇవ్వాలని కోరుతున్నది బకెట్ నీట్లో నీటి బొట్టంత కూడా లేదు. కార్మికుల కోర్కెలు చాలావరకూ తీర్చేవిగానే ఉన్నాయి. రూ.47-50 కోట్లు ఇస్తే నాలుగు ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వీలుంది. రూ.47 కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం లేదా? దివాలా తీసిందా? అంటూ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఇక.. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టు జోక్యం చేసుకునే విషయంలో ఉన్న అధికారాలను ఏజీ ప్రస్తావించటంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు అవస్థలు పడుతుంటే కల్పించుకునే అధికారం ఆర్టికల్ 226 కింద కోర్టుకు ఉందని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన వైనాన్ని గుర్తు చేసింది. ఇది ప్రజా సమస్యే అని తేల్చారని చెప్పటం ద్వారా.. తమకున్న అధికారాల గురించి ప్రశ్నించటం సరికాదన్న వైనాన్ని స్పష్టం చేసింది.
ఆర్టీసీ అంత కష్టాల్లో ఉంటే గతంలో 44 శాతం ఫిట్ మెంట్ ఎందుకు ఇచ్చారు? 22 శాతం కంటే ఎక్కువ ఇవ్వలేమని అప్పుడే ఎందుకు చెప్పలేదు? అంటూ వేసిన ప్రశ్నలు ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని తాము అక్టోబరు 18నే ఆదేశాలు ఇస్తే చివరి వరకూ ఏం చేశారు? అని ప్రశ్నించింది. చర్చలు జరగకూడదని నిర్ణయించుకొని కార్మికులతో చర్చలు జరపలేదని వ్యాఖ్యానించింది.

కార్మిక నాయకులతో ఏం చర్చించాలో ముందే నిర్ణయించుకొని వస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఒక కేసులో శిక్ష వేయాలని మేం చాంబర్ లోనే నిర్ణయించుకొని వాదనలు చెప్పాలంటే ప్రయోజనం ఉండదు కదా? అని ప్రశ్నించిన కోర్టు.. ఈడీల కమిటీ నివేదికను తమకు ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్నతో పాటు.. తమ వద్ద కూడా విషయాల్ని దాచి పెడతారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మొత్తంగా.. వరుస ప్రశ్నలు.. సందేహాలతో పాటు.. ప్రభుత్వ తీరును తప్పు పట్టేలా ఉన్న హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఈ రోజు విచారణ మరింత సీరియస్ గా సాగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.