Begin typing your search above and press return to search.

లాయర్లుగా ఉండి కోర్టు ప్రతిష్ఠను దిగజారుస్తారా? తలంటిన

By:  Tupaki Desk   |   18 Feb 2022 12:30 PM GMT
లాయర్లుగా ఉండి కోర్టు ప్రతిష్ఠను దిగజారుస్తారా? తలంటిన
X
ఇంసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి.. దాని విస్తృతి పెరిగాక మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో వచ్చే లైకులు.. వ్యూస్ పిచ్చలో పడిపోవటం.. తాము సమర్థించే వారి పక్షాన నిలుస్తూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వారి పుణ్యమా అని.. గౌరవనీయమైన వ్యవస్థలు సైతం ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసే వరకు వెళ్లింది. తమకున్న భావస్వేచ్ఛ హద్దులు దాటిన వేళ.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినప్పుడు మాత్రం.. హాహాకారాలు పెట్టటం.. క్షమించాలని చేతులు జోడించటం లాంటివి ఎక్కువ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి ధోరణే ముగ్గురు విషయంలో జరిగింది. ఆ ముగ్గురిలో ఇద్దరు న్యాయవాదులు అయితే.. మరొకరు ఐటీ ఉద్యోగి. న్యాయస్థానాలు.. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో న్యాయవాదులైన మెట్టా చంద్రశేఖరరావు.. గోపాలక్రిష్ణ కళానిధి.. ఐటీ ఇంజనీర్ రమేశ్ కుమార్ లను సీబీఐ అరెస్టు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కు.. వారి తరఫున వాదనలు వినిపించారు న్యాయవాదులు కేజీ క్రిష్ణమూర్తి.. హేమేంద్రనాథ్ రెడ్డి.. కోదండరామిరెడ్డిలు. సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సింది పోయి.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి దాని ప్రతిష్టను ఎందుకు దిగజారుస్తున్నారని ప్రశ్నించారు.

ఇలాంటి చర్యల్ని ఎంతమాత్రం సహించమన్న ఆయన.. ‘‘న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్లోడ్ చేయడాన్ని ఒప్పుకునేది లేదు. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను అసలు సహించం. న్యాయవాదులు, న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ భావన కొనసాగుతుంది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే.. ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. కింది కోర్టు రెండు రోజుల పాటు నిందితులకు సీబీఐ కస్టడీకి ఇచ్చిందని.. న్యాయవాది కళానిధి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ న్యాయవాది.. పిటిషనర్లు న్యాయవ్యస్థ మీద.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అందువల్ల వారికి బెయిల్ ఇవ్వకూడదని వాదించారు.

దిగువ కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చిన దశలో బెయిలు మంజూరు చేయవద్దన్నారు. ఓ వైపు దిగువ కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చి విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని సీబీఐ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి న్యాయవ్యవస్థ మీద సరైన ఆధారాలు లేకుండా.. తమకు తోచిన అభిప్రాయాన్ని.. భావాల్ని వెల్లడించే వారిపై న్యాయస్థానాలు ఆగ్రహంతో ఉన్నాయి. వారిని చట్టప్రకారం అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాయి.అయితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే పలువురు విదేశాల్లో ఉండటంతో.. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సీబీఐ ఇబ్బంది పడుతోంది.

న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు.. ఏదైనా పని మీద దేశానికి వచ్చినప్పుడు మాత్రమే వారిని అదుపులోకి తీసుకోవటానికి కుదురుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా చర్యలు తీసుకోకుంటే.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మంటగలిసే ప్రక్రియలు మరిన్నిచోటు చేసుకునే అవకాశం ఉంది.