Begin typing your search above and press return to search.

ధనుంజయ్ ట్రావెల్స్ ను మూసేయండి: హైకోర్టు

By:  Tupaki Desk   |   19 March 2016 5:14 AM GMT
ధనుంజయ్ ట్రావెల్స్ ను మూసేయండి: హైకోర్టు
X
పూటుగా తాగటమే కాదు.. తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్ ను మార్చాలంటూ వేడుకున్న మెడికోలను వేదనను పట్టించుకోకుండా వారి ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉదంతంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ మీడియా సంస్థల్లో ప్రసారమైన.. ప్రచురించిన వార్తల్ని ప్రజాహిత వాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. తాగినడుపుతున్న డ్రైవర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించటంతో పాటు.. ఈ ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

ఇక.. ఈ ఉదంతానికి కారణమైన ధనుంజయ ట్రావెల్స్ ను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ట్రావెల్స్ కంపెనీపై ఎలాంటి చర్యల్ని తీసుకున్నారన్న అంశంపై హైకోర్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తెలంగాణ ఏఏజీ.. ఎవరి పర్యవేక్షణలో వాహనాల్ని నడుపుతున్నది ఆరా తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రమాదం జరిగింది మార్చి 14 రాత్రి.. ఈ కేసుపై విచారణ జరిగింది 18న. అంటే దాదాపు రెండు రోజులకు పైనే సమయం ఉంది. దారుణ ఘటనకు సంబంధించి ట్రావెల్స్ ఎవరి యాజమాన్యం కింద పని చేస్తుందన్న విషయాన్ని గుర్తించటానికి ప్రభుత్వాలకు రెండు రోజుల సమయం సరిపోదా? కోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా.. ఇబ్బంది లేని సమాధానం చెబుతున్న తీరుపై బాధితుల తరఫు వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన ఘటనను సీరియస్ గా తీసుకొని ఉంటే.. ధనుంజయ ట్రావెల్స్ ఎవరి పర్యవేక్షణలో నడుస్తుందన్న విషయం బయటకు రావటానికి 48 గంటలకు పైనే పడుతుందా? అన్న ప్రశ్నను వింటున్నప్పుడు.. హైకోర్టు ధర్మాసనం ఈ కోణంలో ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపారంలో నిర్లక్ష్యం పెద్ద శిక్షకు కారణం అవుతుందన్న సందేశం అందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది.