Begin typing your search above and press return to search.

కోర్టుకు కోపం వ‌చ్చే మాట‌లు మ‌న‌కు అవ‌స‌ర‌మా సారూ!

By:  Tupaki Desk   |   18 July 2019 8:35 AM GMT
కోర్టుకు కోపం వ‌చ్చే మాట‌లు మ‌న‌కు అవ‌స‌ర‌మా సారూ!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోపం వ‌చ్చేసింది. తాను చేస్తున్న ప్ర‌య‌త్నాలకు అడుగ‌డుగునా అడ్డు ప‌డుతున్న తీరు ఆయ‌న‌లో అస‌హ‌నం కొట్టొచ్చేలా క‌నిపిస్తోంది. త‌న క‌ల‌ల పంటైన కొత్త అసెంబ్లీ.. స‌చివాల‌యం నిర్మాణం కోసం ఇప్ప‌టికే ప‌లు ప్లాన్లు వేసి.. వాటిని మార్చుకున్న కేసీఆర్‌.. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో కొత్త అసెంబ్లీని.. సరికొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా ఇప్పుడున్న చోట‌నే పాత స‌చివాల‌యాన్ని కూల్చేసి కొత్త‌ది క‌ట్టించాల‌ని డిసైడ్ అయ్యారు. అదే స‌మ‌యంలో కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఎర్ర‌మంజిల్ ద‌గ్గ‌ర నిర్మించాల‌ని.. అందులో భాగంగా చారిత్ర‌క భ‌వ‌న‌మైన ఎర్ర‌మంజిల్ ను కూల్చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. చారిత్ర‌క ఎర్ర‌మంజిల్ భ‌వ‌నాన్ని కూల్చేయాల‌న్న నిర్ణ‌యంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ కోర్టును ఆశ్ర‌యించ‌టం తెలిసిందే.

ఈ అంశంపై హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా.. చారిత్ర‌క క‌ట్ట‌డాల్ని కూల్చివేసే అంశంపై ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప్ర‌భుత్వ భ‌వ‌నం పేరుతో కూల్చేస్తారా? అజంతా ఎల్లోరా గుహ‌లూ ప్ర‌భుత్వానివేన‌ని.. అంత మాత్రాన వాటిని కూల్చేస్తామంటే ఒప్ప‌కుంటారా? అని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

క‌ట్ చేస్తే.. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలు స్టార్ట అయ్యాయి. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్ర‌తి భ‌వ‌నాన్ని చారిత్ర‌క భ‌వ‌నంగా వితండ‌వాదం చేస్తున్నార‌ని.. ప్ర‌తి భ‌వ‌నం చారిత్ర‌క భ‌వ‌నం అయితే.. అభివృద్ధి ప‌నులు సాధ్యం కాద‌న్నారు.

ఉస్మానియా ఆసుప‌త్రి చారిత్ర‌క వార‌స‌త్వ భ‌వ‌న‌మ‌ని.. ఇప్పుడున్న స్థ‌లంలోనే కొత్త ఆసుప‌త్రి నిర్మించాల‌ని కొంద‌రు అంటున్నార‌ని.. కొన్ని రూల్స్ కార‌ణంగా పురాత‌న భ‌వ‌నాల్ని కూల్చివేయ‌టం సాధ్యం కాద‌న్నారు. పాత భ‌వ‌నాల విష‌యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆయ‌న పేర్కొన్న వితండ‌వాదం మాట‌లు కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వ‌న్న‌ట్లుగా ఉన్నాయి. కోర్టును ఉద్దేశించి నేరుగా అన‌కున్నా.. పురాత‌న క‌ట్ట‌డాలు.. చారిత్ర‌క భ‌వ‌నాల మీద త‌న అభిప్రాయంగా ముఖ్య‌మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వ్యాఖ్య‌లు తొంద‌ర‌పాటుతో కూడికున్న‌వ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కోర్టుకు కోపం వ‌చ్చే మాట‌లు అవ‌స‌ర‌మంటారా కేసీఆర్?