Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారుపై హైకోర్టు ఫైర్..రాళ్ల‌ను కూడా మిగ‌ల్చ‌రా?

By:  Tupaki Desk   |   25 July 2019 5:00 AM GMT
కేసీఆర్ స‌ర్కారుపై హైకోర్టు ఫైర్..రాళ్ల‌ను కూడా మిగ‌ల్చ‌రా?
X
ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న హైకోర్టు తాజాగా హైద‌రాబాద్‌ మ‌హాన‌గ‌రంలోని ఒక ప్రాంతంలోని గుట్ట‌ను బాంబుల‌తో పేలుస్తున్న వైనంపై న‌మోదైన ప్ర‌జావ్యాజ్యాన్ని విచారిస్తూ ఆగ్ర‌హాన్ని.. ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది.

వివిధ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌లు ప్ర‌కృతిని ధ్వంసం చేయ‌టం స‌రికాదంటూ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని స‌ర‌స్సుల‌న్నీ మాయ‌మ‌య్యాయ‌ని.. రాళ్ల‌ను కూడా మిగ‌ల్చ‌రా? అంటూ ప్రశ్నించింది. ప్ర‌కృతి విధ్వంసంతో ఉప‌ద్ర‌వాల్ని ఆహ్వానిస్తున్నామ‌ని.. ప్ర‌కృతి సిద్ధంగా ఏర్ప‌డిన ఏక‌శిలా రూపాలు.. రాల్ల ప‌రిర‌క్ష‌ణ‌కు ఉన్న ప్ర‌ణాళిక ఏమిటో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా పుప్పాల‌గూడ‌లో బాబా ఫ‌కృద్దీన్ ఔలియా ద‌ర్గా వ‌ద్ద పేలుళ్ల‌తో రాళ్ల‌ను ప‌గుల‌గొడుతున్నార‌ని.. ఇలా రాళ్ల‌ను ప‌గ‌ల‌కొట్టి నిర్మాణాల‌కు అనుమ‌తులిస్తూ పోతే చివ‌ర‌కు ఏమీ మిగ‌ల‌ద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. భావిత‌రాల‌కు ఏం చేపించాల‌ని ప్ర‌శ్నించిన హైకోర్టు.. విధ్వంసాన్ని ఆప‌కుండా పోతే గుడ్ గామ్ కి హైద‌రాబాద్ కు పెద్ద తేడా ఏమీ ఉండ‌దంది.

ఫ‌కృద్దీన్ గుట్ట‌లో రాళ్ల‌ను కొట్టి నిర్మాణాల్ని చేప‌ట్ట‌ట‌మ‌న్న‌ది చిన్న ఉదంత‌మేన‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివెన్నో సాగుతున్నాయ‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వార‌స‌త్వ సంప‌ద‌ల‌తో పాటు ప్ర‌కృతి స‌మ‌తౌల్యాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త అంద‌రి మీదా ఉంద‌ని.. వీటిపై ఎన్నో జీవ‌రాశులు ఆధార‌ప‌డి ఉన్న విష‌యాల్ని గుర్తించాల‌ని పేర్కొంది. ఇష్టారాజ్యంగా నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇచ్చేస్తున్న వైనంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.