Begin typing your search above and press return to search.

ఓపీఎస్‌కు హైకోర్టు నై.. ఈపీఎస్‌కే జై!

By:  Tupaki Desk   |   3 Sep 2022 9:30 AM GMT
ఓపీఎస్‌కు హైకోర్టు నై.. ఈపీఎస్‌కే జై!
X
త‌మిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం టీవీ సీరియ‌ల్ మాదిరిగా అనేక మ‌లుపులు తిరుగుతోంది. పార్టీపై పెత్త‌నం కోసం మాజీ ముఖ్య‌మంత్రులు ఈ ప‌ళ‌నిస్వామి (ఈపీఎస్), ఓ ప‌న్వీరు సెల్వం (ఓపీఎస్) పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పోటీలో ఈపీఎస్‌కు అనుకూలంగా మ‌ద్రాసు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కీల‌క తీర్పు వెలువ‌రించింది. అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు ప‌ళ‌ని స్వామికే ద‌క్కుతాయ‌ని మ‌ద్రాసు హైకోర్టు ద్వి స‌భ్య బెంచ్ పేర్కొంది. ప‌న్నీరు సెల్వం (ఓపీఎస్‌)కే ప‌గ్గాల‌ని ఇంత‌కుముందు మ‌ద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజ‌న్ బెంచ్ ప‌క్క‌న పెట్టింది.

ఈ నేప‌థ్యంలో ఈపీఎస్ వ‌ర్గీయులు సంబ‌రాల్లో మునిగిపోగా, ఓపీఎస్ సుప్రీంకోర్టులో హైకోర్టు డివిజ‌న్ బెంచ్ నిర్ణ‌యంపై అప్పీలు చేయ‌నున్నారు.

కాగా 2017లో అన్నాడీఎంకే అధినేత్రి, అప్ప‌టి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూశాక పార్టీపై పెత్తనాన్ని జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ తీసుకున్నారు. నాడు తాత్కాలిక ముఖ్య‌మంత్రిగా ఉన్న ఓ ప‌న్నీరు సెల్వంను త‌ప్పించి తాను సీఎంను కావాల‌ని త‌ల‌చారు. అయితే ఓపీఎస్ తెర వెనుక బీజేపీ మ‌ద్దతుతో ముఖ్య‌మంత్రి కావ‌డానికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. అయితే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌లేక‌పోయారు. మ‌రోవైపు సీఎం ప‌ద‌విని చేప‌ట్టాల్సిన శ‌శిక‌ళ అక్ర‌మాస్తుల కేసులో జైలుపాల‌య్యారు. దీంతో ఆమె త‌న వ‌ర్గీయుడైన ప‌ళ‌ని స్వామిని ముఖ్య‌మంత్రిని చేశారు.

అయితే ఆ త‌ర్వాత మారిన ప‌రిస్థితులు, తెర వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల జోక్యంతో ఈపీఎస్, ఓపీఎస్ క‌లిసిపోయారు. శ‌శిక‌ళ‌ను, ఆమె మేన‌ల్లుడు దిన‌క‌రన్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మంత్రిగా, అన్నాడీఎంకే కో క‌న్వీన‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక ప‌న్నీరు సెల్వం ఉప ముఖ్య‌మంత్రిగా, అన్నాడీఎంకే క‌న్వీన‌ర్‌గా చ‌క్రం తిప్పారు.

అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓడిపోయాక ఈపీఎస్, ఓపీఎస్ మ‌ధ్య పార్టీపై పెత్త‌నం కోసం అభిప్రాయ భేదాలు త‌లెత్తాయి. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శుల మ‌ద్ద‌తు ప‌ళ‌ని స్వామికే ఉండ‌టంతో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. అంతేకాకుండా ప‌న్నీరు సెల్వంను, ఎంపీగా ఉన్న ఆయ‌న కుమారుడిని, మ‌రికొంత‌మందిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. దీనిపై ప‌న్నీరు సెల్వం మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించారు. మ‌ద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ప‌న్నీరు సెల్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై డివిజ‌న్ బెంచ్ లో ప‌ళ‌నిస్వామి అప్పీలు చేశారు. దీంతో డివిజ‌న్ బెంచ్ ప‌ళ‌ని స్వామికే పార్టీ ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని తేల్చిచెప్పింది. పార్టీ స‌భ్యుల్లో ఎక్కువ మంది ఆయ‌న‌కే అనుకూలంగా ఉన్నారని పేర్కొంది.

ఈ మేర‌కు జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని మ‌ద్రాసు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఆమోదించింది. సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు త‌మిళ‌నాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ద్విసభ్య బెంచ్‌ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించ‌డంతో ఇప్ప‌ట్లో ఈ వివాదం తీరేలా క‌నిపించ‌డం లేదు.

కాగా ప‌న్నీరు సెల్వం వ‌ర్గీయుల వాద‌న మ‌రోలా ఉంది. కేవలం సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్‌ రద్దు చేసింద‌ని అంటున్నారు. అయితే, సింగిల్‌ బెంచ్‌లో ఇంకా కేసు విచార‌ణ‌లోనే ఉంద‌ని చెబుతున్నారు. మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందేన‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.