Begin typing your search above and press return to search.

బాబుకు హైకోర్టు భ‌లే షాకిచ్చిందిగా!

By:  Tupaki Desk   |   30 Aug 2017 9:50 AM GMT
బాబుకు హైకోర్టు భ‌లే షాకిచ్చిందిగా!
X
టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబుకు తెలుగు రాష్ట్రాల‌ ఉమ్మ‌డి హైకోర్టులో ఊహించ‌ని విధంగా షాక్ త‌గిలింది. నంద్యాల గెలుపు సంబ‌రాల్లో మునిగిపోయిన బాబు... కోర్టు వ్యాఖ్య‌ల‌తో ఉలిక్కిప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి వైఎస్ ప్ర‌భుత్వం స‌హా ఆ త‌ర్వాత‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో తెలుగు త‌మ్ముళ్లు రెచ్చిపోయారు. దీంతో వీరిపై కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా అంత‌కు ముందు కూడా అత్యాచారం స‌హా వివిధ కేసులు టీడీపీ నేత‌ల‌పై ఉన్నాయి. అయితే, బాబు అధికారంలోకి రాగానే ఆయా కేసుల‌ను అన్నింటినీ ఉప‌సంహ‌రిస్తూ.. త‌మ్ముళ్ల‌కు క్లీన్ చిట్ ఇస్తూ.. ఇప్పుడు టీడీపీ జ‌మానాలో ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

క‌లెక్ట‌ర్ స్థాయి అధికారులే బాబు మాట‌ల‌తో బుట్ట‌లో ప‌డి త‌మ్ముళ్ల‌పై కేసులు లేకుండా చేసే ప్ర‌య‌త్నాల‌కు తెర‌లెత్తారు. అయితే, ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి.. వీటిపై హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌జాహిత వ్యాజ్యం కింద బాబు చేస్తున్న కేసుల మాఫీపై పోరాటానికి దిగారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి - చినరాజప్ప - స్పీకర్ కోడెల శివప్రసాద రావు - మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు - కొల్లు రవీంద్ర - నక్కా ఆనంద్ బాబు - అచ్చెన్నాయుడు - గంటా శ్రీనివాస రావులు సహా 273 మంది కేసులు విత్ డ్రా చేసేందుకు బాబు ప్ర‌భుత్వం జీవో జారీ చేసిన విష‌యాన్ని వెల్ల‌డించారు.

వీరిలో ఓ ఎమ్మెల్యేపై అత్యాచారం - హత్య ఆరోపణలు కూడా ఉన్నాయని, కేసులు కూడా న‌మోద‌య్యాయ‌ని ఆళ్ల త‌ర‌ఫు లాయ‌ర్ పిటిష‌న్‌ లో పేర్కొన్నారు. ఈ పిల్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం బాబును క‌డిగి పారేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అన్ని వివ‌రాల‌నూ కోర్టుకు సమ‌ర్పించిన ప్ర‌భుత్వం.. త‌మ‌కు కేసులు విత్ డ్రా చేసుకునే అధికారం ఉంద‌ని కోర్టుకు తెలిపింది. అయితే, దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు .. క్రిమినల్ కేసులు క్లోజ్ చేయాలని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదని స్ప‌ష్టం చేసింది.

ఈ స‌మ‌యంలో క‌లుగ‌జేసుకున్న ప్ర‌భుత్వ లాయ‌ర్ ఆళ్ల కేవ‌లం రాజ‌కీయ దురుద్దేశంతో ఈ పిల్ వేశార‌ని, ఆయ‌న‌కు సంబంధం లేద‌ని కోర్టుకు తెలిపారు. దీంతో మ‌రింత అస‌హ‌నానికి గురైన హైకోర్టు... అయితే, దీని నుంచి ఆళ్ల‌ను ప‌క్క‌న పెడ‌దామ‌ని, తామే స్వ‌యంగా సుమోటోగా ఈ కేసును విచారిస్తామ‌ని అన‌డంతో ప్ర‌భుత్వం గుండెల్లో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్ట‌యింది. అంత‌టితో ఆగ‌ని హైకోర్టు.. ఈ కేసుల విత్‌ డ్రాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో త‌మ‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. మొత్తానికి ఈ ప‌రిణామం.. బాబుకు చేదు గుళికే!!