Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసులో విచార‌ణ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

By:  Tupaki Desk   |   8 Nov 2022 1:04 PM GMT
ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసులో విచార‌ణ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌
X
మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ధర్మాసనం ఎత్తివేసింది. మొయినాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు వంద‌ల కోట్ల ఆశ‌చూపార‌న్న‌ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై వాదనలు జరుగుతున్న సమయంలో మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. అయితే.. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైకోర్టు తాజా తీర్పుతో ఫామ్ హౌజ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్‌ పోలీసులకు మార్గం సుగమమైంది. సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈకేసు విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సి అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.

అసలేం జరిగిందంటే..

టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే అంశం సంచలనం సృష్టించింది. ఒక్కొక్క‌రికీ 100 కోట్ల చొప్పున 400 కోట్లు ఇస్తున్నార‌ని.. దీనికి సంబందించి చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌నే సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు చేశారు.

టీఆర్ ఎస్‌కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాజ‌కీయాల‌ను వారం రోజుల పాటు భారీ ఎత్తున కుదిపేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.