Begin typing your search above and press return to search.

ఏపీ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..

By:  Tupaki Desk   |   6 May 2022 5:31 AM GMT
ఏపీ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విధానానికి కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్ళగా.. ఈ పిటిషన్ పై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. అయితే ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సొంత వేదికలపై టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తెలిపింది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తెచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్నాళ్లు వేచి చూద్దామని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించుకోవచ్చని పేర్కొన్న హైకోర్టు.. ఈ అంశంలో మల్టిప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. ఈ కేసులో తదువరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది.

ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొస్తూ 2021 డిసెంబర్ 17న ఏపీ ప్రభుత్వం జీవో నెం. 142 జారీ చేసింది. సినిమా టికెట్‌ ధరల నియంత్రణతో పాటు, బ్లాక్‌ టికెట్ల దందాకు చెక్‌ పడనుందని ఈ పోర్టల్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ సేవలను అందించడం తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ప్రేక్షకులపై ఆన్ లైన్ చార్జీల భారం పడకుండా అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా సినిమా టికెట్లను విక్రయిస్తాయని తెలుస్తోంది. దీని నిర్వహణ బాధ్యతను జస్ట్ టికెట్ సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. హైకోర్టు నుంచి అనుమతి రావడంతో ఇకపై ప్రభుత్వ గేట్ వే ద్వారానే సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి.