Begin typing your search above and press return to search.

తెలంగాణకు మరో మారు ఎన్నికల కళ

By:  Tupaki Desk   |   22 Oct 2019 8:34 AM GMT
తెలంగాణకు మరో మారు ఎన్నికల కళ
X
పోటా పోటీగా.. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే.. తెలంగాణకు మరోసారి ఎన్నికల కళ వచ్చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశం నేపథ్యంలో తెలగాణలోని పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లే.

తెలంగాణలో నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగటం లేదంటూ కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ వ్యాజ్యాల్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో..తెలంగాణకు మరోమారు ఎన్నికల కళ వచ్చేసినట్లే. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు.. 13 కార్పొరేషన్లు ఉన్నాయి.

వీటిల్లో గ్రేటర్ హైదరాబాద్.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి కాలేదు. అదే రీతిలో మున్సిపాలిటీల్లో కూడా సిద్దిపేట.. అచ్చంపేటలకు పదవీ కాలం ముగిసిపోలేదు. ఈ నేపథ్యంలో పది కార్పొరేషన్లకు.. 121 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపోల్ ఎన్నికలు జరగని ఏడింటిలో.. రెండు మున్సిపాలిటీలకు పదవీ కాలం ముగిసిపోని కారణంగా.. మరో ఐదు మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు కొన్నిసమస్యలు ఉన్నకారణంగా ఎలక్షన్ నిర్వహించే వీల్లేదు. మొత్తంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక టెన్షన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తెలంగాణ అధికారపక్షానికి హైకోర్టు తీర్పుతో మరోసారి ఎన్నికల దిశగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడినట్లుగా చెప్పక తప్పదు.