Begin typing your search above and press return to search.

జగన్ కు ఇది శుభ సంకేతం!

By:  Tupaki Desk   |   10 April 2018 2:16 PM GMT
జగన్ కు ఇది శుభ సంకేతం!
X
వైఎస్ జగన్మోహన రెడ్డి అభిమానులకు శుభవార్త. సీబీఐ విచారణలో ఉన్న కేసులు తమ అధినేతను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టబోతున్నాయో.. ఎన్నెన్ని అగచాట్ల పాల్జేస్తాయో.. అని అనుమానిస్తున్న వైకాపా అభిమానులకు కూడా శుభవార్త. జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకుని ఉన్న కేసుల వలయంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పొర విడిపోతూ వస్తున్నాయి. తాము చేసిన ఆరోపణలను నిరూపించడంలో విచారణ సంస్థ సీబీఐ విఫలం అవుతున్నదనే కోర్టు వ్యాఖ్యానాలు పెరుగుతున్నాయి.. జగన్ సహా విచారణను ఎదుర్కొంటున్న కొందరు ఐఏఎస్ అధికార్లకు క్లీన్ చిట్ దక్కుతోంది. తాజాగా లేపాక్షి హబ్ భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డికి తాజాగా హైకోర్టులో ఊరట లభించడం విశేషం. ఇది ఖచ్చితంగా జగన్ మీద కేసులను నిరూపించడంలో సీబీఐ విఫలం అవుతున్నదని అనడానికి తార్కాణమేనని.. ఆ రకంగా జగన్ అభిమానులందరికీ శుభవార్తే అని అంతా అనుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన కేసులో మురళీధర్ రెడ్డి 12 వ నిందితుడు. ఈ కేసు విచారణలో తన ప్రమేయం తేలనందున.. కేసునుంచి తన పేరు కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం.. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో మురళీధర్ రెడ్డి మీద విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి అధికార్లకు కోర్టులో ఊరట లభించడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే చాలా మంది ఇతర ఐఏఎస్ అధికార్లకు కూడా మినహాయింపు లభించింది. దాదాపుగా ఆ అన్ని కేసుల్లోనూ సీబీఐ విచారణలో వారి పాత్రను నిరూపించడంలో విఫలం అయ్యారనే మాటలే వినిపించాయి.

క్విడ్ ప్రోకో అంటూ కేసులో నమోదు చేశారు గానీ.. అంతిమంగా లబ్ధి పొందడం ఎక్కడ జరిగిందో.. దాంతో నిందితులకు ఎలాంటి పాత్ర ఉన్నదో నిరూపించడంలో సీబీఐ విఫలం అవుతోంది. నెమ్మదిగా.. జగన్ మీద కుట్రపూరితంగా పన్నిన అన్ని కేసులూ మబ్బులు తొలగినట్లుగా తొలగిపోతాయని అభిమానులు అనుకుంటున్నారు.