Begin typing your search above and press return to search.

టీ తమ్ముళ్ల 'జంపింగ్' యవ్వారం తప్పన్న హైకోర్టు

By:  Tupaki Desk   |   22 Sep 2016 4:10 AM GMT
టీ తమ్ముళ్ల జంపింగ్ యవ్వారం తప్పన్న హైకోర్టు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్ యవ్వారానికి సంబంధించి తెలంగాణ సర్కారుకు మరో మొట్టికాయ పడింది. సైకిల్ వదిలిపెట్టేసిన కారు ఎక్కేసిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పలువురు.. తాము నేతృత్వం వహిస్తున్న పార్టీని తెలంగాణ అధికార పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా పేర్కొన్న వైనం ఏ మాత్రం సరి కాదని హైకోర్టు తేల్చేసింది. ఓపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ వద్ద ఉన్న ఫిర్యాదుల లెక్క తేల్చకుండా.. విలీన నిర్ణయాన్ని ప్రకటించటం సరికాదన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో తేల్చేయాలంటూ తెలంగాణ స్పీకర్ ను ఉద్దేశించి పేర్కొంది.

పార్టీ ఫిరాయింపుల మీద.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే.. ఆ విషయాన్ని పక్కన పెట్టి.. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవటం ఏ మాత్రం సరికాదంటూ హైకోర్టు న్యాయమూర్తి తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ఉదంతంపై మూడు నెలల వ్యవధిలోనిర్ణయం తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి.. విజయం సాధించిన ఎమ్మెల్యేలు పలువురు దశల వారీగా తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోవటం తెలిసిందే. ఈ సందర్భంగా తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇలా కంప్లైంట్ చేసిన వారిలో టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అయితే.. ఆయనే తదనంతర కాలంలో పార్టీ నుంచి జంప్ కావటం.. గులాబీ కారులోకి ఎక్కేయటం తెలిసిందే. అదే సమయంలో.. తమ పార్టీని టీఆర్ఎస్ లోకి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని గుర్తించినట్లుగా పేర్కొంటూ టీ స్పీకర్ బులిటెన్ (మార్చి 10) విడుదల చేశారు.

దీన్ని ప్రశ్నిస్తూ టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పదో షెడ్యూల్ ప్రకారం విలీన బులిటెన్ ను జారీ చేశారని.. ఇది ఏ మాత్రం సరికాదంటూ రేవంత్ తరఫు న్యాయవాది వాదించారు. విలీన నిర్ణయం తెలంగాణ స్పీకర్ తీసుకున్నదని.. బిజినెస్ రూల్స్ ప్రకారం.. హౌస్ ను నిర్వహించటం.. నియంత్రించటం లాంటివి స్పీకర్ అధీనంలో ఉంటాయంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

ఈ వాదనల్ని తోసిపుచ్చిన హైకోర్టు.. ఫిరాయింపు ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలంటూ రేవంత్ తరఫు న్యాయవాది చేసిన వాదనను సమర్థించారు. కులదీప్ భిష్ణోయ్ కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన న్యాయమూర్తి.. ఆ కేసులో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా.. మూడు నెలల వ్యవధిలో టీటీడీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. తాజా పరిణామాలు చూస్తే.. కేసీఆర్ సర్కారుకు ఇబ్బందన్న వాదన వ్యక్తమవుతోంది. హైకోర్టు తాజా ఆదేశాలపై టీ స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.