Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌భుత్వానికి 2 వారాల టైమిచ్చిన హైకోర్టు!

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:09 AM GMT
తెలంగాణ ప్ర‌భుత్వానికి 2 వారాల టైమిచ్చిన హైకోర్టు!
X
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వానికి తాజాగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. కీల‌క‌మైన పున‌ర్విభ‌జ‌న‌తో పాటు రిజ‌ర్వేష‌న్ల లెక్క తేల్చే విష‌యంలో జాగు చేస్తున్న కేసీఆర్ స‌ర్కారుపైన తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై హైకోర్టు స్పందించి తాజాగా తెలంగాణ స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు.. మున్సిపాలిటీల్లో అవ‌స‌ర‌మైన చోట వార్డుల పున‌ర్విభ‌జ‌న‌తో పాటు రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. కానీ.. ఆ ప‌ని ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ స‌ర్కారుపై హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు చేసింది.

ఈ అంశంపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పున‌ర్విభ‌జ‌న‌.. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో రెండు వారాల్లో త‌గిన నిర్ణ‌యాన్ని తీసుకోవాలంటూ ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలోని మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌లు.. 53 పుర‌పాల‌క సంఘాల పాల‌క వ‌ర్గాల గ‌డువు జూన్ 2తో ముగియ‌నుంది. వీటికి ఎన్నిక‌ల్ని త‌క్ష‌ణ‌మే నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందే వార్డుల పున‌ర్విభ‌జ‌న‌.. రిజ‌ర్వేష‌న్ల‌ను నిర్ణ‌యించాల్సి ఉంది. అయితే.. ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టివ‌ర‌కూ స్టార్ట్ కాని నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. త‌మ ఉత్త‌ర్వులు అందిన రెండు వారాల వ్య‌వ‌ధిలోనే వార్డుల పున‌ర్విభ‌జ‌న‌.. రిజ‌ర్వేష‌న్ల లెక్క తేల్చాల‌ని ఆదేశించింది. ప‌ని పూర్తి చేసిన త‌ర్వాత ఆ స‌మాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం ఇవ్వాల‌ని పేర్కొంది.