Begin typing your search above and press return to search.

బాబుకు షాక్‌...సీబీఐకి అయేషా మీరా హ‌త్య కేసు

By:  Tupaki Desk   |   29 Nov 2018 1:39 PM GMT
బాబుకు షాక్‌...సీబీఐకి అయేషా మీరా హ‌త్య కేసు
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌న విచ‌క్ష‌ణ అధికారాన్ని ఉప‌యోగించి తీసుకున్న వివాదాస్ప‌ద‌ - సంచ‌ల‌న నిర్ణ‌యం త‌దుప‌రి ద‌శ‌లో ఏం జ‌రుగుతుందో అనే ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్రంలోనే కాదు - దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించిన అయేషా మీరా హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి అప్ప‌గించింది. హ‌త్య కేసులో రికార్డుల ధ్వంస్వంపై కూడా విచార‌ణ జ‌రిపించాల‌ని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసి అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమైన అధికారులపై అపెక్స్ కమిటీ ద్వారా చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయేషా మీరా హత్య కేసులో పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్లీ దర్యాప్తు చేయాలని ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ రమా మెల్కోటే తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిని విచారించిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది.

అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇకపై రాష్ట్రంలో దాడులు - దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ఆ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించడం ద్వారా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం డోర్లు క్లోజ్ చేసింది. ఢిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు జనరల్‌ కన్సెంట్‌ తెలపాల్సి ఉంటుంది. అయితే, కోర్టు ఉత్త‌ర్వులు ఉండ‌టంతో వాటి ఆధారంగా సీబీఐ ఏపీలోకి ప్ర‌వేశించే అధికారం పొందిన‌ట్ల‌య్యింది.