Begin typing your search above and press return to search.

కేసీఆర్ దూకుడుతో ఆంధ్రుల హ‌క్కుల‌కు ఎస‌రు?

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:10 AM GMT
కేసీఆర్ దూకుడుతో ఆంధ్రుల హ‌క్కుల‌కు ఎస‌రు?
X
తాను అనుకున్న నిర్ణ‌యం విష‌యంలో..ప్ర‌ధానంగా రాజ‌కీయ వ్య‌తిరేక‌త ఎదురైన సంద‌ర్భంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తిపక్షాలు ఏదైనా ఓ విష‌యంలో అడ్డుప‌డితే....మునుప‌టి కంటే బ‌లంగా కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తారు. కొత్త స‌చివాల‌యం నిర్మాణం విష‌యంలో కేసీఆర్ తాజాగా అదే దోర‌ణితో సాగుతున్నారు.  ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీమాంధ్రుల‌కు హైదరాబాద్ లో హ‌క్కులు క‌ల్పించే అంశంపై అనూహ్య వాద‌న‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలు - ఆస్తులపై గవర్నర్‌ కు నిర్ణయాధికారం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పిటిషనర్లు పేర్కొనగా.. తెలంగాణ క్యాబినెట్ సలహా మేరకు గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆ చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు ప్రస్తావించింది. క్యాబినెట్ సూచన మేరకు గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి - క్యాబినెట్ సిఫారసులను గవర్నర్ ఆమోదించడానికి మధ్య తేడా ఉన్నదని - అదేమిటో వివరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఏపీకి సంబంధించిన అసెంబ్లీ - సచివాలయం - హైకోర్టు అమరావతికి తరలిపోయినప్పుడు ఏపీ పునర్విభజన చట్టంతో సంబంధం ఏమున్నదని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ గవర్నర్ - సీఎం కార్యాలయాలతోపాటు అసెంబ్లీ - సచివాలయం - హైకోర్టు అన్నీ అమరావతిలో ఉన్నప్పుడు సెక్షన్ 8 సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది? ఆ సెక్షన్‌ కు కాలం చెల్లినట్టేకదా? దేశంలో కాలం చెల్లిపోయిన చాలా చట్టాలు ఉన్నాయని - వాటిని తొలిగించాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్ ఎప్పటికప్పుడు మనకు గుర్తుచేస్తుంటుంది అని ధర్మాసనం తెలిపింది.

తెలంగాణ ఏర్పాటు - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు స‌మ‌యంలో సెక్ష‌న్ 8 ద్వారా హైద‌రాబాద్‌ పై ప‌దేళ్ల వ‌ర‌కు ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌క్కుపై తాజాగా న్యాయ‌స్థానంలో తెర‌మీద‌కు వ‌చ్చిన వాద‌న‌ల‌తో....ప్ర‌భుత్వ ఆస్తులు త‌ర‌లించ‌నున్నారు కాబ‌ట్టి...సెక్ష‌న్ 8 అవ‌స‌రం లేద‌ని - దాన్ని ఉప‌సంహ‌రించే ప్ర‌య‌త్నం తెర‌మీద‌కు రానుందా అంటూ ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ఆ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌తో స‌మానంగా ప‌క్క‌రాష్ట్రంలోని వారిని సైతం ప్ర‌భావితం చేస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.