Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే ఆశలపై నీళ్లు చల్లిన హైకోర్టు..!

By:  Tupaki Desk   |   12 Nov 2021 12:30 PM GMT
ఆ ఎమ్మెల్యే ఆశలపై నీళ్లు చల్లిన హైకోర్టు..!
X
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో ఆపార్టీ ఎమ్మెల్యే హవానే కొనసాగుతోంది. అయితే న్యాయస్థానాల్లో మాత్రం వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిపాలన అనుభవలేమితో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పలుమార్లు కోర్టులచే మొట్టికాయలు తిన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో వైసీపీ నేతలకు న్యాయస్థానాలు అచ్చిరావడం లేదనే టాక్ ఏపీలో జోరుగా సాగుతోంది.

తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి వెలుగుచూసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సాధినేని ఉదయభానుకు హైకోర్టు చుక్కలు చూపించడం చర్చనీయాంశంగా మారింది. సాధినేని ఉదయభానుపై ఏపీలో పది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీటన్నింటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల జీవో జారీ చేసింది.

అయితే దీనిని జర్నలిస్టు నాయకుడు అంజనేయుడు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తరుఫున జడ శ్రావణ్ అనే న్యాయవాది వాదించారు. ప్రభుత్వం ఒకే ఒక్క జీవోతో ఎమ్మెల్యేపై ఉన్న 10కేసులను ఎలా ఉపసంహరించుకుంటుందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు ప్రభుత్వం ఆయనపై ఉన్న కేసులను ఉపసంహరించుకుందో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

ఈ విషయంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే ఉదయభాను, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్నప్పటికీ కోర్టులో మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎమ్మెల్యేకు అనుకూలంగా జీవో జారీ చేయడంలో ప్రభుత్వం సైతం చిక్కుల్లో పడినట్లు కన్పిస్తోంది.

ఈ సంఘటనతో మరోసారి వైసీపీ నేతలకు న్యాయస్థానాలు అచ్చిరానేది నిరూపణ అయిందని పలువురు కామెంట్ చేస్తుండటం గమనార్హం. మొత్తానికి దేవుడి వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే చందంగా వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి మారడం విడ్డూరంగా మారింది. దీంతో ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే విషయంలో హైకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.