Begin typing your search above and press return to search.

జస్టిస్ చంద్రు కామెంట్లపై హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   13 Dec 2021 5:30 PM GMT
జస్టిస్ చంద్రు కామెంట్లపై హైకోర్టు సీరియస్
X
ఏపీలో న్యాయ వ్యవస్థపై మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తీవ్రంగా ఖండించారు. తాజాగా రిటైర్డ్ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రచారం కోసం కొందరు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లైమ్ లైట్ కోసం ఆ వ్యాఖ్యలు చేసేవారి లైట్స్ఆఫ్ చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ద్వారా తాము ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.

ఒకటి, రెండు అంశాల ఆధారంగా మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ''ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్‌పై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండి. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా?.'' అని జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, ఇప్పటి వరకు పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు..సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉంటూ భారత న్యాయవ్యవస్థను విమర్శించడం ఏమిటని, మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశాల్లో ఉన్న నిందితుల అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ ను జనవరి 25లోపు దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.