Begin typing your search above and press return to search.

సీఎంగా బాబు ఖర్చుపై హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   25 Oct 2019 4:14 AM GMT
సీఎంగా బాబు ఖర్చుపై హైకోర్టు సీరియస్
X
ప్రజాధనాన్ని పప్పుబెల్లాల మాదిరి ఖర్చు చేసే అధికారం ఎవరికి ఉండదు. కానీ.. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎంత విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారన్న విషయం తాజా ఉదంతంలో స్పష్టమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వహించారు.

మోడీ సర్కారుపై తనకున్న అక్కసును ప్రదర్శించటానికి.. ఏపీ ప్రజల్ని ఎమోషన్ లోకి తీసుకెళ్లటం ఈ దీక్ష లక్ష్యంగా చెప్పాలి. అయితే.. ఈ దీక్ష కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసిన వైనం అప్పట్లోనే సంచలనంగా మారింది. ఈ ఖర్చు లెక్కకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలోని వేటుకూరికి చెందిన సూర్యనారాయణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్.. న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఒక రోజు దీక్ష కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారా? ఏ చట్టం కింద ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేశారు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే కాదు.. ఈ నిధుల్ని విడుదల చేసిన అధికారులు ఎవరని ప్రశ్నించింది. విలువైన ప్రజాధనాన్ని అలా వృథా చేస్తారా? అంటూ ఫైర్ అయ్యింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు ధర్మపోరాట దీక్ష చేశారని.. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు పిటిషన్ దారు ఆరోపించారు.

పిటీషన్ తరఫు న్యాయవాది ఒక్కరోజు దీక్షకు రూ.10 కోట్లు అన్నంతనే? ధర్మాసనం అంత ఖర్చా? అని విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఆ డబ్బంతా ప్రజలు పన్నురూపంలో వసూలుచేసిందే కదా? అని వ్యాఖ్యానించిన కోర్టు మాటకు.. సదరు పిల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కూడా వచ్చి ఉండొచ్చన్నారు. అసలు ప్రజాధనాన్ని ఇలాంటి రాజకీయ కార్యక్రమాల కోసం విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన అన్ని వివరాల్ని తమకు సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ ఇష్యూ మీద తదుపరి విచారణను వచ్చే నెల 21కు వాయిదా వేసింది. మొత్తానికి బాబు చేసిన ఇష్టారాజ్యపు ఖర్చు విషయంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.