Begin typing your search above and press return to search.

స్పీకరు విచక్షణను కోర్టు నిలదీస్తోంది!

By:  Tupaki Desk   |   4 Oct 2017 1:16 PM GMT
స్పీకరు విచక్షణను కోర్టు నిలదీస్తోంది!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనసభల స్పీకర్లు చాలా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో.. అధికారం తమ విచక్షణ కు లోబడి ఉంటుందనే నిబంధనను ఎంచక్కా వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలకు అవసరమైన విషయాల్లో వారు అసలు నిర్ణయమే తీసుకోకుండా.. కాలహరణం చేసేస్తున్నారు. అయితే హైకోర్టులు కేసులు నడుస్తున్నప్పటికీ... కేసులు కొన్ని సుప్రీం కోర్టు వరకు వెళుతున్నప్పటికీ... స్పీకర్లను నిలదీసిన సందర్భాలు లేవు. రాజ్యాంగబద్ధ పదవి అయిన, శాసనాధికారం ఉన్న స్పీకరు హోదాను ప్రశ్నించే నోటీసులు ఇచ్చే అధికారం న్యాయస్థానానికి కూడా ఉండదనే చట్టంలోని వెసులుబాటు ప్రకారం.. వారి నిర్ణయాల్లో జాప్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేకున్నారు. ప్రతిపక్షాలు కోర్టుల్లో ఎన్ని కేసులు నడుపుతున్నప్పటికీ.. కోర్టులు ప్రతిసారీ.. స్పీకరుకు లేఖలు రాయడం, సూచనలు చేయడం జరుగుతోందే తప్ప.. నిలదీయడం అంటూ జరగలేదు. అదే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కూడా.... స్పీకరు నిర్ణయం వివాదాస్పదంగా మారిన తర్వాత.. హైకోర్టు ఈ విషయంలో స్పీకరుకు నోటీసులు సర్వ్ చేయడం అనేది సంచలనం సృష్టిస్తోంది.

తమిళరాజకీయాలు తాజాగా ముదిరిపాకాన పడి ఉన్నాయి. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ అనుచరులైన ఎమ్మెల్యేలపై పళనిస్వామి ప్రభుత్వం ఫిర్యాదు మేరకు స్పీకరు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దినకరన్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో స్పీకరు నిర్ణయాన్ని నిలదీసేలా కోర్టు ఉత్తర్వులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో... గతంలో పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాసపరీక్షలో ఓటు వేసినప్పుడు వారి మీద అనర్హత వేటు వేయలేదంటూ.. డీఎంకే కూడా ఓ పిటిషన్ వేసింది. దానిని కూడా హైకోర్టు ప్రశ్నిస్తోంది. అయితే ఇలాంటి నిర్ణయాలన్నీ స్పీకరు విచక్షణ పరిధికి లోబడిన నిర్ణయాలు. వాటిని ప్రశ్నించే అధికారం హైకోర్టుకు ఉందా? లేదా? అనేదానిపై ఈ దేశంలోనే స్పష్టత లేదు.

అదే వెసులుబాటు ఆధారంగా తెలుగురాష్ట్రాల రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇక్కడ స్పీకర్లను ప్రశ్నించే దిక్కులేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపక్షాలనుంచి లెక్కకు మిక్కిలిగా ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లో చేరిపోయారు. వారి మీద అనర్హత వేటు వేయాలంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. పట్టించుకున్న దిక్కులేదు. కోర్టులో పిటిషన్లు వేశాయి. ప్రయోజనం లేదు. అయితే తమిళ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం హైకోర్టు స్పీకరుకు ఏకంగా నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.