Begin typing your search above and press return to search.

ఇద్దరు కలెక్టర్లకు టీహైకోర్టు షాక్.. జైలు.. జరిమానా

By:  Tupaki Desk   |   10 March 2021 6:30 AM GMT
ఇద్దరు కలెక్టర్లకు టీహైకోర్టు షాక్.. జైలు.. జరిమానా
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం ఇద్దరు కలెక్టర్లకు షాకిచ్చింది. కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారంటూ సిద్దిపేట కలెక్టర్లుగా పని చేసిన వెంకటరామిరెడ్డి.. క్రిష్ణభాస్కర్ లతో పాటు.. ఆర్డీవో..భూసేకరణ అధికారి జయచంద్రారెడ్డిలకు జైలుశిక్ష.. జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

రెండు విడతలుగా కలెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డికి మూడు నెలల సాధారణ జైలుశిక్ష.. జరిమానా కింద రూ.2వేలు చెల్లించాలని ఖర్చుల కింద పిటిషనర్లకు రూ.25వేలు ఇవ్వాలని పేర్కొంది. అంతేకాదు.. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా వ్యవహరిస్తున్న క్రిష్ణ భాస్కర్ 2018 ఆగస్టు నుంచి 2019 జూన్ వరకు సిద్దిపేట కలెక్టర్ గా వ్యవహరించారు. ఆ సందర్భంగా జరిపిన భూసేకరణ ఎపిసోడ్ లో ఆయనకు రూ.2వేల ఫైన్ వేశారు.

ఆర్డీవో జయచంద్రారెడ్డికి నాలుగు నెలల సాధారణ జైలుశిక్ష.. రూ.2వేల ఫైన్ వేశారు. పిటిషనర్ల తరఫున ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించారు. అయితే.. ఈ తీర్పు అమలు వెంటనే కాకుండా అప్పీలుకు వీలుగా ఆరు వారాల పాటు నిలిపివేయటం గమనార్హం. ప్రాజెక్టులో భాగంగా భూమి సేకరణ చేపట్టొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. రైతుల్ని బెదిరించి భూమిని స్వాధీనం చేసుకోవటాన్ని తప్పు పట్టారు.

భూమిని స్వాధీనం చేసుకోలేదని అధికారులు కౌంటర్లు దాఖలు చేస్తే.. పంచనామా చేసి పిటిషనర్లకు అప్పగించాలంటూ ఈ ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. అయితే.. కోర్టు ఆదేశాల్ని అమలు చేసే క్రమంలో తమకు సంబంధంలేని ఇతరుల భూముల్ని తమకు అప్పగించినట్లుగా పిటిషన్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని వారు కోర్టుకు సమర్పించారు. దీంతో.. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటూ తన నిర్నయాన్ని వెల్లడించింది. ఈ తీర్పు ఇప్పడు సంచలనంగా మారింది.