Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు ఛీఫ్ జ‌స్టిస్‌ ల‌పై క్లారిటీ!

By:  Tupaki Desk   |   27 Dec 2018 4:05 PM GMT
ఇద్ద‌రు ఛీఫ్ జ‌స్టిస్‌ ల‌పై క్లారిటీ!
X
ఇద్ద‌రి ముఖ్య‌మంత్రుల‌ కోరిక తీరింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు ఎవ‌రో తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్ నియ‌మితులు కాగా - ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ తెలంగాణ సీజేగా కొనసాగనున్నారు. వీరి నియామ‌కాల‌పై గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ కొత్త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జనవరి 1న ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.

నిన్న కొంద‌రు జ‌డ్జిల‌ను కేటాయించిన కేంద్రం తాజా ఉత్త‌ర్వుల్లో జస్టిస్‌ ఆర్‌ ఎస్‌ చౌహన్‌ - జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ ల‌ను తెలంగాణకు కేటాయిస్తు ఆదేశాలిచ్చింది. వీరి నియామకంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉమ్మ‌డి హైకోర్టులో 27 మంది ఉండేవారు. వారిలో 14 మందిని ఏపీ కేటాయించ‌డంతో తెలంగాణ‌కు 10 మందే ఉండ‌టంతో తాజాగా కొంద‌రిని ప్ర‌క‌టించారు.

కొత్త‌గా ఏపీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయిన ప్రవీణ్ కుమార్ 1961లో జన్మించారు. ఆయ‌న హైద‌రాబాదీ. హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశారు. 1986లో న్యాయవాద వృత్తి చేప‌ట్టారు. క్రిమినల్ లాయర్‌ గా పనిచేస్తూనే 2012లో హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. మ‌రుస‌టి ఏడాదే 2013లో పూర్తి స్థాయి న్యాయమూర్తి అయ్యారు.

తెలంగాణ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రాధాకృష్ణ‌ది కేరళలోని కొల్లాం. 1959 లో జన్మించారు. స్కూలు చ‌దువు కేర‌ళ‌లో పూర్త‌వ‌గా - కర్ణాటకలోని కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్ (కేజీఎఫ్) లా కాలేజీ నుంచి లాయర్‌ పట్టా సాధించారు. 1983లో తిరువ‌నంత‌పురంలో న్యాయవాది వృత్తి చేపట్టారు. గ‌తంలో రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప‌నిచేశారు. 2017 మార్చి 18న ఛత్తీస్‌ గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గా బాధ్యతలు చేపట్టి 2018 జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

ఏపి హైకోర్టు నిర్మాణం అమరావ‌తిలో తుది ద‌శ‌కు చేరుకుంది. జన‌వ‌రి 1 నుంచే ఏపీలో కోర్టుకు భ‌వ‌నం అవ‌స‌రం కావ‌డంతో తాత్కాలికంగా అమ‌రావ‌తి స‌చివాల‌యంలో గాని లేదా విజ‌య‌వాడ‌లో ఏదైనా భ‌వ‌నంలో గాని నిర్వ‌హించే అవ‌కాశం ఉందంటున్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు దీనిపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.