Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   3 Feb 2022 9:30 AM GMT
ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టు కీలక ఆదేశాలు
X
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని సూచించింది. ఈనెల 20 వరకూ ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది.

హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుపాలని కోర్టు ఆదేశించింది.

సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబందనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు సూచించింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రెండు వారాల్లో కరోనా పరిస్థితులపై మరోసారి నివేదిక సమర్పించాలని హైకోర్టు తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉందని పేర్కొన్నారు. నారాయణపేటలో 8.88, కామారెడ్డిలో 8.32 , ఆసిఫాబాద్ లో 8 శాతం పాజిటివిటీ రేటు ఉందని వివరించారు.

దేశంలో, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని డీహెచ్ కోర్టుకు వివరించారు. 99 లక్షల ఇళ్లల్లో జ్వరం సర్వే చేసి 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు ఇచ్చామని.. విద్యాసంవత్సరం నష్టపోవద్దనే బడులు తెరిచామని విద్యాశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. పాఠశాలల్లో నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.