Begin typing your search above and press return to search.

రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌నే విష‌యం పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..

By:  Tupaki Desk   |   5 Feb 2022 8:30 AM GMT
రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌నే విష‌యం పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..
X
ఏపీ రాజ‌ధాని అంశంపై హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై అన్ని ప‌క్షాల వాద‌న‌లు ముగిశాయి. దీంతో హైకో ర్టు ఈ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పును రిజ‌ర్వ్ చేసింది. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్ప టికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపై మాత్ర‌మే దృష్టి సారించిన‌ట్టు తెలిపింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు.

ఇక‌, వీటికి అర్హ‌త లేదు!

అంతేకాకుండా అది వరద, భూకంప ప్రభావిత ప్రాంతమని కూడా కమిటీ నివేదికలో ప్రస్తావించింద న్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసిందన్నారు. అందులో భాగంగానే అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను సవరించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. గత ప్రభుత్వం ఈ–బ్రిక్స్, గ్రాఫిక్స్‌ చూపించి రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని పేర్కొన్నారు.

జ‌గ‌న్ అలా చేయాలంటే..

శాసన మండలి తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాజధానిగా అమరావతి ఉండటంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పారని అన్నారు. ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సీఆర్‌డీఏ ఏర్పాటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలే అవుతాయన్నారు.

రైతుల త‌ర‌ఫున ఏమ‌న్నారంటే...

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్‌ తదితరులు వాద‌న‌లు వినిపిస్తూ.. రైతుల వాదనలు వినకుండానే హైవర్‌ కమిటీ, బోస్టన్, జీఆర్ఎన్‌ రావు కమిటీలు నివేదికలు ఇచ్చాయని, అవేమీ చట్టబద్ధ నివేదికలు కాదన్నారు. అందువల్ల వాటిని కొట్టి వేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనలకు లోబడే అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పథకం కింద కల్పించాల్సిన ప్రయోజనాలన్నింటినీ రైతులకు అందించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల న్నింటినీ పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.