Begin typing your search above and press return to search.

ఎర్రబుగ్గల కార్ల వినియోగంపై హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   10 Feb 2022 11:30 AM GMT
ఎర్రబుగ్గల కార్ల వినియోగంపై హైకోర్టు కీలక ఆదేశాలు
X
అర్హత లేని వ్యక్తులు... నిబంధనలకు విరుద్ధంగా ఎర్ర బుగ్గల కార్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వీటి వినియోగం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొంది. అంతేకాకుండా శబ్ధ కాలుష్యం కూడా పెరుగుతోందని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఎర్ర బుగ్గల కార్ల వినియోగంపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హత లేని వ్యక్తులు వాటిని వినియోగించకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలు చాలామంది పాటించడం లేదని మహబూబ్ నగర్ కు చెందిన ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కొందరు అధికారులు, రాజకీయ నాయకులు ఎర్ర బుగ్గల కార్లను వినియోగిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఎర్ర బుగ్గల కార్ల దుర్వినియోగంపై న్యాయవాది భావనప్ప దాఖలు చేసిన పిల్ పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలి తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మోటారు వాహనాల చట్టం లోని 119 సెక్షన్ కు విరుద్ధంగా చాలామంది ఆ కార్లను వాడుతున్నారని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

దీనివల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యానికి కూడా కారణమవుతున్నారని వాదనలు వినిపించారు. అయితే ఎర్ర బుగ్గల కార్ల వినియోగంపై విడుదల చేసిన మార్గదర్శకాలు పక్కాగా అమలవుతున్నాయని రాష్ట్రం ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం... ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర బుగ్గల కార్ల వినియోగంపై మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని చూడాలని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే... కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

అంతేకాకుండా కార్లలో ఉపయోగించే హారన్ విషయంలోనూ... అవసరమైతే మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎర్ర బుగ్గల కార్ల వినియోగంపై చేపడుతున్న చర్యల పై ఆరా తీసింది. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ... పిల్ పై విచారణ ముగించింది. ఈ మేరకు హైకోర్టు ప్రకటించింది.