Begin typing your search above and press return to search.

స్కూళ్ల మూసివేత‌, ఇంగ్లిష్ మీడియంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రోసారి హైకోర్టు వాత‌లు!

By:  Tupaki Desk   |   7 July 2022 7:30 AM GMT
స్కూళ్ల మూసివేత‌, ఇంగ్లిష్ మీడియంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రోసారి హైకోర్టు వాత‌లు!
X
స్కూళ్ల మూసివేత‌, స్కూళ్ల విలీనం, ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డం, తెలుగు మీడియం ఎత్తేయ‌డం త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం చేపట్టిన స్కూళ్ల విలీనాలు, మూసివేతలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని, విద్యార్ధులకు చదువుల్ని దూరం చేస్తున్నాయని దాఖలైన పిటిషన్లపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు నిప్పులు చెరిగింది.

విద్యా సంస్కరణల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లను విలీనం చేసి మిగతా స్కూళ్లను మూసివేస్తారా అంటూ ప్రశ్నించింది. జాతీయ విద్యావిధానంతో పాటు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ హైకోర్టు ఆక్షేపించింది. హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి రెండు రోజుల సమయం కోరింది.

విద్యాసంస్కరణల పేరుతో జ‌గ‌న్ ప్రభుత్వం చేపడుతున్న స్కూళ్ల విలీనాలు, మూసివేతలతో పాఠశాల విద్యావ్యవస్ధ నిర్వీర్యమవుతోందంటూ పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. టీచర్లు, స్కూళ్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోందని పిటిష‌న్ లో పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ 30 విద్యార్ధులకో టీచర్ ఉండాలని చెబుతున్నా దాన్నీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. స్కూళ్ల మూసివేత‌తో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడం వల్ల బాలికలు స్కూలు మానివేసే అవ‌కావం ఉంద‌ని తెలిపారు.

అలాగే ప్ర‌భుత్వ‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపైనా జ‌గ‌న్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళంగా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ఒకే మీడియంలో విద్యాబోధన ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అది ఏ మీడియం అనేది చెప్పకపోవడంపై పిటిషనర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలాగే 9, 10 తరగతుల్లో రెండు మీడియాలు ఉంటాయని చెబుతూనే కనీసం 20 మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని చెప్పడం కూడా స‌రికాదంటున్నారు.

దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రాథ‌మిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందని గుర్తుచేసింది. ప్రభుత్వ నిర్ణయం చూస్తుంటే తెలుగు మీడియంలో విద్యాబోధన లేకుండా చేసేలా కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

హైకోర్టు వ్యాఖ్య‌ల‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరాం.. నూతన విద్యావిధానం అమలు కోసం వివరాలు మాత్రమే సేకరిస్తున్నామని, స్కూళ్ల తరలింపు, విలీనాలు, మూసివేతల ప్ర‌క్రియ మొద‌లుకాలేదన్నారు. రెండు రోజుల సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామన్నారు. ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ కు బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరారు. దీంతో కోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది.