Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంటికి నోటీసులు

By:  Tupaki Desk   |   1 March 2016 8:05 AM GMT
చంద్రబాబు ఇంటికి నోటీసులు
X
ఏపీ రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించాలన్న ఉత్సాహంతో కృష్ణానది ఒడ్డున సీఎం చంద్రబాబు తన నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే ఉన్న ఓ భవనాన్ని ఆయన నివాసంగా ఉపయోగిస్తున్నారు. అయితే... ఆ ఇల్లు అక్రమ నిర్మాణమో కాదో చెప్పాలంటూ హైకోర్టు నోటీసులు పంపింది.

కృష్ణానది ఒడ్డున ప్రకాశం బ్యారేజీ ఎగువభాగంలో గుంటూరు జిల్లా వైపు కరకట్ట దిగువన నిర్మించిన నిర్మాణాలు అక్రమాలని 2015 ఫిబ్రవరిలో తాడేపల్లి తహశీల్దార్‌ ఇచ్చిన నోటీసులపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలో సమాధానం చెప్పాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవన యజమానులూ సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. కాగా ఈ ప్రాంతంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ కు చెందిన గెస్ట్‌ హౌస్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు. హైకోర్టు ఆదేశాలు ఈ భవన యజమానికి వర్తిస్తాయి. దీనిపై వారంలో లింగమనేని రమేశ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

కరకట్ట దిగువభాగంలో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారని, వాటిపై 2015 ఫిబ్రవరిలో స్థానిక తహశీల్దార్‌ నోటీసులు జారీచేసినా ప్రభుత్వం స్పందించలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై వారంలో పూర్తివివరాలు ఇవ్వాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ఆదేశించింది. అయితే రెండు వారాలు గడువు కావాలని న్యాయవాది కోరగా హైకోర్టు తిరస్కరించింది. ముఖ్యంగా ఈ భవనాలకు గత ఏడాది తహశీల్దార్‌ జారీచేసిన నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. దీంతోపాటు అక్కడున్న పరిస్థితిపై వాస్తవాలను సమర్పించాలనీ సూచించింది. దీంతో చంద్రబాబు ఇంటికి నోటీసులు పంపినట్లయింది.