Begin typing your search above and press return to search.

కోర్టు అంటే లెక్కేలేదా..బాబు స‌ర్కారుపై హైకోర్టు ఫైర్‌

By:  Tupaki Desk   |   21 March 2018 5:00 AM GMT
కోర్టు అంటే లెక్కేలేదా..బాబు స‌ర్కారుపై హైకోర్టు ఫైర్‌
X
ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు నుంచి ఘాటు కౌంట‌ర్ ఎదురైంది. కోర‌టుం అంటే లెక్కేలేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డింది. కోడి పందేల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల గుర్తింపుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ ఇచ్చిన వివరణపై హైకోర్టు అసంతప్తిని వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి మాత్రమే గుర్తించామని, ఇంకెవరెవరు కోడిపందేలు ఆడారో గుర్తించేందుకు సమయం కావాలని ఏపీ సర్కార్‌ హైకోర్టును కోరింది. దీనిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేసింది.

భీమవరం మండలం శ్రీరాంపురం - వెంప గ్రామాల్లో సంక్రాంతి పండుగకు కోడి పందేల పేరుతో అశ్లీల డ్యాన్స్‌ లు - గుండాట - జూదం - వ్యభిచారం నిర్వహిస్తున్నారని, వీటిని అడ్డుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు మరోసారి విచారించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌ - న్యాయమూర్తి కె.విజయలక్ష్మిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఎదుట ఎపి అడ్వకేట్‌ జనరల్‌ డి.శ్రీనివాస్‌ వాదిస్తూ.. టీవీ9 చానల్‌ మాత్రమే కోడిపందేల వీడియో ఫుటేజిని అందజేసిందని, అందులో ఒకే ఒక్క ప్రజాప్రతినిధి కోడిపందేలు ఆడినట్లుగా తేలిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి ఒకే ఒక్క ప్రజాప్రతినిధి కోడిపందేలు ఆడారా - ఎమ్మెల్యేలు - ఎంపిటిసి - జెడ్పీటిసి సభ్యులు ఎంతోమంది కోడిపందేలు ఆడినట్లు టీవీల్లో ప్రసారమైందని కొంతమంది పెద్దలైతే టీవీల ముందు కోళ్లు పట్టుకుని గొప్పగా ప్రసంగాలు కూడా చేశారని హైకోర్టు పేర్కొంది.

ఎన్‌ డిటివి వంటి జాతీయ టీవీ చానల్‌ లో కూడా కోడిపందేలు ఆడుతున్నట్లుగా పెద్దలు మాట్లాడినట్లు వచ్చిందన్నారు. కోర్టులంటే లెక్కలేనట్లుగా స్పందన ఉందని - కోడిపందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటే కచ్చితమైన సమాధానాన్ని ఇచ్చినట్లు అవుతుందని హైకోర్టు అభిప్రాయ పడింది. దీనిపై ఎజి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తప్పిం చుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కానేకాదని, మరో అవకాశం ఇస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుమతించిన హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.