Begin typing your search above and press return to search.

సీఎం చెబితే ఇంత హడావుడి చేస్తారా?

By:  Tupaki Desk   |   29 Sep 2016 6:05 AM GMT
సీఎం చెబితే ఇంత హడావుడి చేస్తారా?
X
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా చేయకూడదన్న విషయం తెలిసినా అధికారులు మాత్రం అదే వైనాన్ని అనుసరించటం ఇప్పటివరకూ చూసిందే. తాజాగా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోవటం.. హైదరాబాదీలు నానా అవ‌స్థ‌లు ప‌డ‌టం తెలిసిందే. పెద్ద ఎత్తున కాలనీల్లోకి వర్షపు నీరు చొచ్చుకురావటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నెర్ర చేశారు. ఇదంతా నాలాల‌పై అక్రమ నిర్మాణాల కారణంగానే జరిగిందని, ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని తేల్చేయటమే కాదు.. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదని.. అక్రమ నిర్మాణం కనిపిస్తే చాలు వాటి అంతు చూడాలని ఆయ‌న‌ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోయిన గ్రేటర్ అధికారులకు హైకోర్టు తాజాగా మొట్టికాయలు వేసింది. స్పీడ్ కు బ్రేకులు వేయటమే కాదు.. అత్యుత్సాహం పనికి రాదని.. ఇంతకాలం లేని హడావుడి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం హడావుడి చేసేస్తారా? అని మొట్టికాయలు వేసింది. అక్రమ కట్టడాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే.. ఏం చేసినా నిబంధనలకు తగ్గట్లు మాత్రమే చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

అక్రమ కట్టడాలంటూ కూల్చివేతల్ని షురూ చేసిన గ్రేటర్ అధికారుల తీరును తప్పుపడుతూ హైకోర్టును పలువురు ఆశ్రయించారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాటి విచార‌ణ సంద‌ర్భంగా.. ఆక్రమణల తొలగింపులో జీహెచ్ఎంసీ తొందరపాటు చర్యల్ని తప్పు పట్టింది. ఇంతకాలం ఏం చేశారు? ఇప్పడింత హడావుడి ఏమిటి? అంటూ అడగాల్సిన ప్రశ్నల‌న్నిటినీ వ‌రుసపెట్టి అడిగేసింది. అవినీతికి పాల్పడిన కొందరు అధికారులు అనుమతులు మంజూరు చేశారని.. ఆక్రమణ‌లు కొనసాగుతున్న స‌మ‌యంలో ముడుపులు తీసుకుని మౌనంగా ఉన్న అధికారులు ఇప్పుడు హడావుడి చేయటంలో వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును హైకోర్టు తప్పు పట్టింది. నాలాలను ఆక్రమించిన నిర్మాణాల కారణంగా ఇళ్లల్లోకి నీరు వచ్చిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో విభేదించిన హైకోర్టు.. కొన్నేళ్లుగా ఆక్రమణలు సాగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఆక్రమణల్ని ప్రాథ‌మిక దశలోనే తొలగించి ఉంటే ప్రస్తుత పరిస్తితి తలెత్తేది కాదని.. రెవెన్యూ.. పురపాలక శాఖల్లో అవినీతి ఉందని సీఎం చెబుతున్నారని.. వీటిపై చర్యలు తీసుకోకుండా ఏసీబీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు చెందిన ఇళ్లను కూల్చివేసిన సంఘటనలు ఉన్నాయా? అని కోర్టు నిలదీసింది. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయొద్దని తాము చెప్పటం లేదు కానీ.. చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి కూల్చాలని హైకోర్టు పేర్కొంది. పిటీషన్లు దాఖలు చేసిన వారి నిర్మాణాల కూల్చివేత పనుల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.